పేదల సంక్షేమమే సర్కార్‌ లక్ష్యం:ఎమ్మెల్యే

నిర్మల్‌,అక్టోబర్‌11 (జనంసాక్షి) : పేదల సంక్షేమమే లక్ష్యంగా ఏడేళ్ల పాలనలో సిఎం కెసిఆర్‌ అద్భుత ప్రగతిని సాధించారని ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి అన్నారు. క్షేత్రస్థాయిలో పేద, మధ్యతరగతి వర్గాల కష్టాలు, కన్నీళ్లు తెలిసి వారికి అవసరమైన పథకాలు అమలు చేస్తున్న వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, కేసీఆర్‌ కిట్లు, పింఛన్లు సహా శాశ్వత అభివృద్ధి పనులతో ఎంతో ప్రగతి సాధించిందని గుర్తుచేశారు. అన్ని వర్గాలకు అవసరమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రజల్లో చిరస్థాయిగా ఉంటుందని అన్నారు. అభివృద్ధి చూసి ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారని గుర్తుచేశారు. రైతు సమన్వయ సమితులు, భూ సంస్కరణ సర్వేలు, ఎకరాకు రెండు పంటలకు రూ.8000 పెట్టుబడి డబ్బు, రాష్ట్రంలో 90,000 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో మండలానికి ఒక గోదాం నిర్మాణం అభివృద్దిలో భాగమన్నారు. గిట్టుబాటు ధరలకు కృషి చేస్తూ సీఎం కేసీఆర్‌ అన్నదాత కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారని గుర్తుచేశారు. భారీ చేరికలతో గ్రామాలు గులాబీ వనాలయ్యాయిని, ఇక కాంగ్రెస్‌కు ఏ ఎన్నికల్లోనూ డిపాజిట్లు దక్కవన్నారు. విద్య, వైద్యం, కమ్యూనికేషన్‌, తాగు, సాగు నీటి పథకాలకు ప్రాధాన్యమిచ్చి ప్రభుత్వం ఆ మేరకు సమర్థవంతంగా నిర్మాణాత్మక అమలుతో ప్రగతి సాధిస్తున్నదని వివరించారు.