పైలట్‌ కంట్రోల్‌ చేసేందుకు యత్నించినా ఫలించలేదు


ఇండోనేషియా విమానప్రమాదంపై నివేదిక
పార్లమెంటుకు సమర్పించిన కమిటీ
జకార్తా,నవంబర్‌28(జనంసాక్షి): ఇండోనేషియాలోని జావా సముద్రంలో గత నెల ఓ విమానం కూలిపోయి 189 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనకు సంబంధించి ప్రాథమిక దర్యాప్తు నివేదికను అధికారులు బుధవారం ఆ దేశ పార్లమెంట్‌కు వెల్లడించారు. అక్టోబరు 29న ఇండోనేషియాలో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. 189 మంది ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న లయన్‌ ఎయిర్‌ జెట్‌ విమానం ఒకటి టేకాఫ్‌ అయిన 13 నిమిషాలకే జావా సముద్రంలో కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని మొత్తం 189 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విమానాన్ని నడిపిన పైలట్లలో భారత్‌కు చెందిన భవ్యే సునేజా ఉన్నారు. ఘటన సమయంలో విమానం నడుపుతున్న భారత పైలట్‌ విమానాన్ని కంట్రోల్‌ చేసేందుకు ఎంతో పోరాటం చేశారని బ్లాక్‌ బాక్స్‌ డేటా ఆధారంగా నివేదికలో పేర్కొన్నారు. బోయింగ్‌ 737 విమానంలోని ఆటోమేటిక్‌ సేఫ్టీ సిస్టమ్‌ పదే పదే విమాన ముందుభాగాన్ని కిందకు తోసింది. సాధారణంగా విమానం ఎక్కువ ఎత్తులో ఎగురుతున్నప్పుడు సెన్సార్స్‌ గుర్తించి ఆటోమేటిక్‌ భద్రతా వ్యవస్థకు సమాచారమిస్తాయి. దీంతో అది విమానాన్ని కిందకు దించుతుంది. కానీ ప్రమాదం జరిగిన విమానం తక్కువ ఎత్తులో ఎగురుతున్నప్పటికీ ఇలా జరిగింది. దీంతో విమానాన్ని పైకి తెచ్చేందుకు పైలట్లు మ్యానువల్‌గా ప్రయత్నించారు. అయితే అది కాసేపే పనిచేసింది. మళ్లీ విమానం కిందకు రావడంతో మరోసారి ప్రయత్నం చేశారు. అసలు సమస్య ఎక్కడ తలెత్తిందో పైలట్లకు అర్థం కాలేదు. దీంతో ఆటోమేటిక్‌ సేఫ్టీ వ్యవస్థలోని తప్పుడు యాక్టివేషన్‌ను సరిచేసేందుకు తమకు తెలిసిన ప్రయత్నం చేశారు. అలా 26సార్లు చేసినప్పటికీ ఆ లోపం సరికాలేదు’ అని నివేదికలో పేర్కొన్నారు. ఘటన సమయంలో పైలట్లు ఎంతో పోరాడారు. కానీ వారి పోరాటం ఫలించలేదు. అంతేగాక.. సెన్సార్లు ఇచ్చే సమాచారం సరైందా కాదా అన్నది గుర్తించడం కూడా ఆ సమయంలో కష్టంగా మారింది. ప్రమాదానికి ముందు ప్రయాణాల్లోనూ విమానంలో ఇలాంటి సమస్య వచ్చింది. అయితే దాన్ని లయన్‌ ఎయిర్‌ జెట్‌ సరిచేయలేదు. ఒకవేళ చేసి ఉంటే.. ఈ ప్రమాదం జరిగేది కాదేమో. ప్రతి ప్రమాదం వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి’ అని నివేదిక వెల్లడించింది. కాగా.. ఈ నివేదికపై బోయింగ్‌ ఇంకా స్పందించలేదు.