పొన్నాలకు కోదండ మద్దతు

పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం?

హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): పొన్నాలకు టిక్కెట్‌ వస్తుందా రాదా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మిగిలింది. పొన్నాలకు టిక్కెట్‌ నిరకారణపై చివరకు కోదండరామ్‌ కూడా కొంత కినుకగా ఉన్నట్లు సమాచారం. దీంతో జనగామ బరి నుంచి తప్పుకోవాలని టీజేఏస్‌ అధ్యక్షుడు కోదండరాం నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. బీసీలకు అన్యాయం జరగకూడదనే కోదండరాం ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలియవచ్చింది. జనగామ నుంచి కోదండరాం పోటీ చేస్తారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే నిన్న కాంగ్రెస్‌ ప్రకటించిన తొలి జాబితాలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేరు లేకపోవడంతో రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి నెలకొంది. కాగా మంగళవారం తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో టీజేఎస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. జనగాం నుంచి కోదండరాం పోటీ చేయకూడదని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బీసీలకు అన్యాయం చేయడం తమకు ఇష్టం లేదు కాబట్టి.. కోదండరాం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలియవచ్చింది. అయితే కోదండరాం ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఈ సాయంత్రం తెలిసే అవకాశం ఉంది. కూటమిలో భాగంగా టీజేఎస్‌కు కాంగ్రెస్‌ 8 సీట్లు కేటాయించింది. ఇప్పటికే ఆ పార్టీ 5 స్థానల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. ఇకపోతే జనగామ స్థానం నుంచి తాను పోటీ చేసే విషయంపై ఇప్పుడే ఏవిూ మాట్లాడలేనని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. మహాకూటమితో పొత్తులో భాగంగా తెజసకు 11 సీట్లు ఇవ్వాలని తాము కాంగ్రెస్‌ను అడుగుతున్నట్టు చెప్పారు. ఇప్పటికైతే తెజసకు ఆరు స్థానాలపై మాత్రమే స్పష్టత ఉందన్నారు. మరికొన్ని స్థానాలపై పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు. తాము పోటీచేసే అన్ని స్థానాలపై స్పష్టత వచ్చాక వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. మల్కాజ్‌గిరి, మెదక్‌, దుబ్బాక, సిద్దిపేట, వర్థన్నపేట, అంబర్‌పేట స్థానాలపై తమకు స్పష్టత వచ్చిందని వివరించారు. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ సీటు కేటాయించాలని కాంగ్రెస్‌ను కోరుతున్నట్టు తెలిపారు. ఊహాగానాల ఆధారంగా మాట్లాడటం సమంజసంకాదన్నారు.