పోడురైతులకు చెక్కుల పంపిణీ

పెట్టుబడిని సద్వినియోగం చేసుకోవాలన్న ఎంపి
భద్రాద్రి కొత్తగూడెం,మే24(పోడురైతులకు చెక్కుల పంపిణీ): పోడు రైతులకు ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి రైతు బంధు చెక్కులను పంపిణీ చేశారు. అన్నపురెడ్డిపల్లి మండలంలోని మర్రిగూడెం, అబ్బుగూడెం గ్రామాల్లో ఈరోజు 95 మంది పోడు రైతులకు సుమారు రూ. 7,89,000 విలువైన రైతుబంధు చెక్కులను ఎంపీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపి మాట్లాడుతూ రైతులకు పెట్టుబడి సాయం అందించిన ఘనత ఒక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని, అందులోనూ పోడుదారులకు కూడా రైతుబంధు పథకం కల్పించిన ఆత్మబంధువు కేసీఆర్‌ అని పొగడ్తలతో ముంచెత్తారు. పోడు రైతులు ప్రభుత్వం కల్పించిన రైతుబంధు చెక్కులను పంట వ్యవసాయానికే వినియోగించుకోవాలని, ప్రభుత్వం త్వరలోనే ఎరువులకు సబ్సిడీ కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని, విత్తనాలు, పురుగుమందులు కూడా అందుబాటులోకి వస్తాయని, రైతులెవరూ దళారులను ఆశ్రయించకుండా సొంతంగా వ్యవసాయం చేసుకోవాలన్నారు. రైతురాజ్యం దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పయనిస్తున్నారని, రానున్న కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులతో పాటు అన్నివర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని, ఇప్పటికే ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు కేసీఆర్‌ పాలనను ఆశీర్వదిస్తున్నారని పేర్కొన్నారు.