పోలీసు ఉద్యోగ అభ్యర్థుల భిక్షాటన

వయోపరిమితి నాలుగేళ్లకు పెంచాలని ఆందోళన
హైదరాబాద్‌, జూన్‌19(జ‌నం సాక్షి) : పోలీసు ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల గరిష్ఠ వయో పరిమితి నాలుగేళ్లకు పెంచాలని తెలంగాణ పోలీసు నిరుద్యోగ అభ్యర్థులు హైదరాబాద్‌లో వినూత్న నిరసన చేపట్టారు. ఈ విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లేందుకు బంజరాహిల్స్‌ లోని మంత్రుల నివాస ప్రాంగణం ఎదుట అభ్యర్థులు భిక్షాటన నిర్వహించారు. ప్రాంగణం గేటు ముందే భిక్షాటన చేయడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల సడలింపు ఇచ్చినప్పటికీ దీనివల్ల కొంత మంది మాత్రమే లబ్ధిపొందుతారని… మరో ఏడాది వయోపరిమితి పెంచితే సుమారు 50వేల మంది కానిస్టేబుల్‌, 30 వేల మంది ఎస్‌ఐ అభ్యర్థుల కుటుంబాలు లబ్ధి పొందుతాయని తెలిపారు. 2015-16 నోటిఫికేషన్‌లో వయోపరిమితి నాలుగేళ్లు పెంచారని వారు గుర్తు చేశారు. ఎన్నో రోజులుగా తాము నోటిఫికేషన్‌ విడుదలవుతుందని ఎంతో ఆశతో ఎదుచూశామని కానీ ప్రభుత్వం వయోపరిమితిని తగ్గిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేయటం సరికాదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే స్పందించి పోలీస్‌ శాఖలోని ఉద్యోగాల్లో 2015-16 నోటిఫికేషన్‌లో వయోపరిమితి నాలుగేళ్లు పెంచాలని తద్వారా తమకు న్యాయం చేయాలని కోరారు.