ప్రకృతితో మమేకమయ్యే బతుకమ్మ

మనజీవన విధానం అంతా కూడా ప్రకృతితో మమేకమై ఉంది. ప్రకృతి ఆరాధన అన్నది భారతీయ సంస్కృతితో పెనవేసుకుని ఉంది. పుట్టలను,చెట్లను, పూలను పూజించే గొప్పతనం మనది. మానవుడి జీవితంతో ముడిపడి ఉన్న ప్రతి వస్తువును ఆరాధనగా చూసి ప్రేమించి పూజించడం మన వారసత్వానికి నిదర్శనం. అందుకే ఆకాశం,నీరు,గాలి, నిప్పు,భూమిలనుపంచభూతాలుగా పూజిస్తున్నాం. ఇలాంటి ప్రకృతి రమణీయకతకు బతుకమ్మ నిదర్శనం. ఇదో రకంగా గౌరీపూజను చేయడం.. అమ్మవారికి  దసరా ముందు శరన్నవరాత్రులు ఎలా జరుపుతామో తెలంగాణాలో 9రోజులపాటు బతుకమ్మ వేడుకలను అలా జరుపడం ఆనవాయితీ. ఈ 9 రోజుల్లో కూడా తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలంతా గుమిగూడా ఆడుకోవడం…ఆడపిల్లలను ఇంటికి రప్పించి వేడుక చేయడం పెద్ద సరదా. రంగురంగుల పుష్ప సౌందర్యాల హంగులతో సింగారించుకొనే బంగరు కల్పవల్లిగా బతుకమ్మను తెలంగాణవాసులు భావిస్తారు. ఓ పళ్లెంలో గుమ్మడి ఆకులు పరచి, వాటిని పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ముందుగా గుమ్మడి పువ్వుల్ని అమర్చి- అక్కడే తంగేడు, బీర, గన్నేరు, నిత్య మల్లె, బంతి వంటి పుష్పాల్నిపేర్చి కూర్చడం కళాత్మకంగా చేస్తారు.  అదే పువ్వుల దొంతరపై తమలపాకులో పసుపు గౌరమ్మను అలంకరిస్తారు. ఆ పుష్ప సముదాయాన్నే బతుకమ్మగా వ్యవహరిస్తారు. మహిళలు లయాత్మకంగా అడుగులు వేస్తూ, చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. బతుకమ్మ ఆవిర్భావం, గౌరీదేవి లీలలు, సామాజిక జీవన రీతులు, కుటుంబాల అనుబంధాలు, పురాణగాథలు, ఇతిహాస ఘట్టాల్ని వారు పాటల రూపంలో ఆలపిస్తారు. పసుపుబొట్టు పేరిట తాంబూలాలు ఇచ్చి పుచ్చుకొంటారు. బతుకమ్మను పసుపు, కుంకుమలతో ఆరాధించి వివిధ రకాల పదార్థాల్ని నివేదన చేస్తారు. ఆటపాటల అనంతరం, ప్రతి నిత్యం జలాశయాల్లో నిమజ్జనం చేయడం ఈ సంప్రదాయంలో ఒక భాగం. ప్రకృతి స్వరూపిణిగా అమ్మవారిని  భావించి, వివిధ పుష్పాలతో పేర్చి ‘బతుకమ్మ’గా ఆరాధిస్తారు. బతుకమ్మగా పిలిచే గౌరమ్మ అయినా, దేవీరూపాలలోని పదుగురు అమ్మలయిన లలితాదేవి, అన్నపూర్ణ, రాజరాజేశ్వరి, పార్వతి, మహాలక్ష్మి, గాయత్రి, సరస్వతి, దుర్గ, మహిషాసురమర్దని, అపరాజితాదేవి అందరూ పరాశక్తికి చెందిన ప్రధాన, ఉపప్రధాన, అంశాత్మక స్వరూపాలేనని మన పురాణాలు చెబుతు న్నాయి. భూమివిూది మట్టి, చెట్టు, నీరు, నిప్పులలోనే కాదు, గ్రామగ్రామాన వెలసిన ఎల్లమ్మ, బాలమ్మ, పోలేరమ్మ, పెద్దమ్మలు.. వంటి అమ్మలంతా ఆమెకు ప్రతీకలు, ప్రతిరూపాలే. ఇంతేనా, సమస్త సృష్టికే ఆమెనే మూలం.మహాలయ అమావాస్య నుంచి మహర్నవమి వరకు సాగే ఈ ఉత్సవం తెలంగాణ సాంస్కృతిక సౌరభాల్ని వెదజల్లుతుంది.అందుకే మన జీవన విధానం, సామాజిక ఏకత్వానికి మన పండుగలు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. జాతి చరిత్రకు, సంస్కృతికి, సంప్రదాయ వైభవానికి ఈ ఉత్సవాలు ఉపకరిస్తున్నాయి. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన బతుకమ్మ పండగలో ప్రకృతి ఆరాధనతో పాటు కుటుంబ కట్టుబాటు, ఆచారాలు ఇమిడి ఉన్నాయి.  సంఘంలో క్రమశిక్షణకు, వ్యక్తుల ఆధ్యాత్మిక సరళికి ఇవి దోహదం చేస్తున్నాయి. ఈ పరంపర లోకే ఆశ్వయుజ మాసంలో నిర్వహించే శరన్నవరాత్రులు కూడా వస్తాయి.  ఆటపాటల నేపథ్యంగా, నిత్య జీవన రీతికి అనుగుణంగా ఈ సంబరాల్ని కొనసాగిస్తారు. ప్రాణశక్తి, ప్రాణధాత్రి, ప్రాణెళిశ్వరి అనే ఆదిశక్తి నామాలకు ప్రతిబింబం.  బతుకమ్మ అంటే  బతుకునివ్వడంతో పాటు, సకల ప్రాణులకూ జీవశక్తిని అందజేసే ప్రకృతి, ఆకృతి- బతుకమ్మ. తొమ్మిది రోజులపాటు బతుకమ్మ సందడి విలసిల్లుతుంది. పూర్ణత్వానికి సంకేతం- తొమ్మిది. నవ విధ భక్తి మార్గాలకు, నవ నిధులకు ప్రతిబింబంగా బతుకమ్మను తొమ్మిది రకాల పుష్పాలతో
తొమ్మిది వరసల్లో అమరుస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో- మొదటి, రెండో రోజుల్లో బొడ్డెమ్మగా, మూడో రోజు లక్ష్మీదేవిగా, నాలుగో రోజు గౌరమ్మగా ఆరాధిస్తారు. అయిదో రోజు అట్ల బతుకమ్మగా, ఆరో రోజు అలిగిన బతుకమ్మగా, ఏడో రోజు చకినాల బతుకమ్మగా, ఎనిమిదో రోజు దుర్గమ్మగా, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా ఆరాధించడం సంప్రదాయం. తొమ్మిది రోజులూ గౌరీదేవి ‘పూలమ్మ’గా పుట్టింటికి తరలి వచ్చినట్లు భావిస్తారు. తమ ఇంటి ఆడబిడ్డగా బతుకమ్మను భావిస్తూ, ఆరాధన చేస్తారు. తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మకు సాగనంపు వేడుక నిర్వహిస్తారు. గౌరమ్మను అత్తవారింటికి- అంటే, శివుడి వద్దకు పంపుతూ, సకల సౌభాగ్యాలూ అనుగ్రహించడానికి మళ్లీ తరలిరమ్మని వేడుకుంటారు. ప్రకృతి నుంచి ఆవిష్కృతమైన పూల పుంత బతుకమ్మ. జలాల్లో సమ్మిళితమై, చివరికి ఆ ప్రకృతిలోనే మమేకమవుతుంది. పూలతో బతుకమ్మ ఆవిర్భవించడం, ఆటపాటలతో అలరింతగా వేడుక చేయడం, నిమజ్జనంతో అనంత ప్రకృతిలో సంలీనం కావడం అనేవి- జగన్మాత సృష్టి, స్థితి, లయాత్మక తత్వాలకు సంకేతాలుగా భావించాలి. నవరాత్రుల్లో చేసే చక్రార్చనకు మరో రూపమే బతుకమ్మ ఆరాధన. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తుల సమ్మేళన రూపం ఆమె. ‘ప్రకృతిని పూజించండి, పరిరక్షించండి. ఆ ప్రకృతే మిమ్మల్ని రక్షిస్తుంది’ అనే సామాజిక ఆత్మీయ సందేశాన్ని బతుకమ్మ అందిస్తుంది. . తెలంగాణ లోగిళ్లలో కులాలకు అతీతంగా బతుకమ్మను పెద్ద ఎత్తున ఆడుతారు. తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకలు, నవర్రాతుల దేవీ పూజలతో అంతటా సందడి కనిపించనుంది.
—-
ఆదిపరాశక్తి రూపమే అమ్మవారు
నేటి నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
అణువుల నుంచి బ్రహ్మాండాల వరకూ వ్యాపించిన విశ్వరూపిణి, విజయ వినోదిని ఆదిపరాశక్తి. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. అమ్మల రూపంలో సమస్త మానవాళిని పులకింపజేయడానికి ఆ జగజ్జననియే తరలి వస్తున్న శుభవేళయే దసరా శరన్నవరాత్రులు. అమ్మవారిని రోజూ నిష్టగా పుల రూపాల్లో పూజించడంతో పాటు నైవేదా/-ంయలు సమర్పించి ఆరదాధించడం ఈ పండగ ప్రత్యేకత. వర్షఋతువు తర్వాత వచ్చే శరధృతువు అంటేనే వెన్నెల కాచే చల్లని సమయం. దేవీ నవరాత్రులను కూడా ప్రతీ హైందవ సమాజమూ అత్యంత భక్తి ప్రపత్తులతో జరుపుకుంటుంది. ఆశ్వీయుజ మాసం తొలి రోజుల్లో జరిగే ఈ రెండు వేడుకల్లోనూ కోట్లాది మందితో ఆరాధనలు అందుకొనే దైవం ఒక స్త్రీమూర్తి కావడం విశేషం. ఆమెనే సకల జగముల నేలే జగదాంబ. ప్రతీ ఒక్క మానవ మాత్రునికీ అత్యంత విశిష్ఠమని చెప్పాలి. ఎందుకంటే,  దుర్గాదేవి , అమ్మల గన్న యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అన్నా.. ఎవరో కాదు, ఆ ఆదిపరాశక్తే. నమ్మిన వారికి, దైవిక సిద్ధాంతాన్ని ఆచరించే వారికి ఆమె అనేక రూపాలలో దర్శనమిస్తుంది.  ఈ శక్తి కూడా అనేక రూపాలలో కనిపిస్తున్నది. అనంత విశ్వం మహాశక్తిపైనే ఆధారపడి ఉంది. భారతీయ ధర్మశాస్త్రాలు ప్రతీ స్త్రీమూర్తినీ శక్తికి ప్రతీకగా అభివర్ణించాయి. ఆ మాటకొస్తే అవి నారీమణులను పూజ్యనీయుల జాబితాలోకే చేర్చాయి.  త్రిమూర్తులను, త్రిమాతలను, ఇంకా మొత్తంగా దేవతల గణాన్నందరినీ సృష్టించింది ఆదిపరాశక్తియే. ఒక్కమాటలో చెప్పాలంటే, ఆమెనే యావత్‌ సృష్టికి కర్త కర్మ క్రియ. కాబట్టి, సర్వశక్తులకూ కేంద్రస్థానం ఈ మహాశక్తి.  సృష్టికర్త, సంరక్షకురాలు, దుష్ట వినాశనకారి సర్వం ఆమెనే అని దేవీ భాగవత పురాణం పేర్కొన్నది. ఏడు సింహాలతో కూడిన రత్నాల సింహాసనంపైన ఆదిశక్తి కూర్చుని ఉండడాన్ని త్రిమూర్తులు చూసినట్లు అందులో ఉందని వేదపండితులు చెప్తారు. ఆదిబీజమే (ఆదిపరాశక్తి)
తనంతట తాను పురుషుడుగా, ప్రకృతి (స్త్రీ)గా విభజితమైనట్లు అష్టాదశ పురాణాలలో ప్రధానమైన బ్రహ్మ పురాణం తెలిపింది. దేవీ భాగవతం ప్రకారం శక్తిలోని శకు ఐశ్వర్యమని, క్తికి పరాక్రమమని అర్థం చెప్పారు. సృష్టి ఆరంభంలో ఒక్క దేవి మాత్రమే ఉందని, ఆమెయే ఈ బ్రహ్మాండాలన్నింటినీ సృష్టించిందని బహ్వృచోపనిషత్‌లోనూ కనిపిస్తుంది. ఆమె నుండే త్రిమూర్తులు, సర్వమూ ఉద్భవించినట్టు కూడా అందులో ఉంది. ఎప్పుడైతే భూమివిూద దానవత్వం పెరుగుతుందో అప్పుడు తాను అవతరించి దుష్టశిక్షణ జరుపుతానని జగజ్జనని అన్నట్టు దేవీసప్తశక్తి పేర్కొంటున్నది.  జగత్తులన్నింటికీ మూలమైన భగవంతుణ్ని సైతం సృష్టించింది భగవతి అయిన ఈ పరాశక్తియే. ఇంతేకాదు, ప్రతీ అణువణువులోని ప్రాణశక్తికి, ఆత్మయిక జీవుల్లో నిగూఢంగా ఉండే కుండలినీ శక్తులకూ, పరమాత్మలోని యోగ-మహామాయలకు.. అన్నింటికీ ఆదిమూలమూ ఆమెనే అని ఆధ్యాత్మిక వేత్తలు అంటారు. ఆ మహాశక్తి విశ్వరూపంలో మన దర్శనానికి అందింది అత్యల్పం. కాబట్టి, ప్రతి ఒక్కరూ అహాన్ని పక్కన పెట్టి శక్తి ఆరాధనకు సంసిద్ధులు కావాలి.శక్తి ఆరాధనను ఏదో ఒక మతానికో, వర్గానికో పరిమితం చేయనవసరం లేదు.  విశ్వంలో కనిపించని శక్తులూ ఇంకా శాస్త్రవేత్తల మేధకు, విజ్ఞాన శాస్త్రాలకు అందకుండానూ ఉన్నాయి. అవన్నీ మహావిశ్వంలో భాగమే అయినప్పుడు, మానవాళికి సర్వతోముఖాభివృద్ధికి అవన్నీ ఉపయోగపడుతున్నప్పుడు వాటిని శక్తి రూపంలో ఆరాధించడంలో తప్పులేదు.