ప్రగతినివేదన సభతో కళ్ళు తెరవాలి: సునీత

 

యాదాద్రి,సెప్టెంబర్‌2(జ‌నం సాక్షి): జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు గంధమల్ల, బస్వాపురం రిజర్వాయర్ల ను నిర్మిస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకోవడం సిగ్గుచేటని ప్రభుత్వ విప్‌, ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. ప్రగతినివేదన సభతో విపక్షాలు కళ్లు తెరవాలని అన్నారు. ఇక తమకు పుట్టుగతులు ఉండవని గుర్తుంచుకోవాలన్నారు. కాళేశ్వరం ద్వారా నీరు ఇక్కడికి తరలించి శాశ్వత నీటి సమస్యకు ప్రణాళిక చేయడం జరిగిందన్నారు. దీంతో ఈ ప్రాంత రైతులకు ఇక నీటి కరువు ఉండదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాల వల్లపుట్టగతులు ఉండవనే విమర్శలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో అభివృద్దిని విస్మరించిన నేతలు ఇవాళ గొంతు చించుకోవడం చూస్తుంటే వారికి భయం పట్టుకుందన్నారు. ప్రభుత్వ అన్నివర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని, అర్హులైన వారందరికి సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తున్నదని అన్నారు. గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగడాన్ని వారు జీర్ణించుకోవడం లేదని అన్నారు. యువజన విభాగం నాయకులు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలన్నారు. రైతులు దర్జాగా బ్రతికేలా సీఎం కేసీఆర్‌ ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

——–