ప్రచారంలో దూసుకుని పోతున్న గులాబీదళం

8న సభ ఏర్పాట్లలో టిఆర్‌ఎస్‌ నాయకులు
విపక్షాల నుంచి ప్రచారంలో ఉన్న భట్టి,సండ్ర
మొత్తంగా ఉమ్మడి జిల్లాలో హీటెక్కిన ప్రచారం
ఖమ్మం,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): ఉమ్మడి జిల్లాలో ఎన్నికల హీట్‌ పెరిగింది. ఎక్కడిక్కడ టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుని పోతున్నారు. కాంగ్రెస్‌ నుంచి ఇప్పటికే మల్లు భట్టి విక్రమార్క, టిడిపి సండ్ర వెంకట వీరయ్యలు మాత్రమే ప్రచారంలో ఉన్నారు. ఇకపోతే టిఆర్‌ఎస్‌కు చెందిన అభ్యర్థులు అంతా ప్రచారంలో బిజీగా ఉన్నారు. నిత్యం ఎక్కడో చోట ఏదో ఓ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారికి మద్దతుగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఎంపిలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రొఫెసర్‌ సీతారాం నాయక్‌లు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇకపోతే  సీఎం కేసీఆర్‌ ప్రసంగించే ఉమ్మడి జిల్లా  భారీ బహిరంగ సభను నిర్వ హించేందుకు నిర్ణయించారు. దీనిలో భాగంగా  అక్టోబర్‌ 8వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లా బహిరంగసభ నిర్వహించేందుకు టీఆర్‌ఎస్‌ శ్రే ణులు ఏర్పాటు చేస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి భారీ బహిరంగసభను ఖమ్మంలో నిర్వహించేందుకు టీఆర్‌ఎస్‌ కసరత్తు ప్రారంభించింది. ఉమ్మడి జిల్లాలోని పది నియోజ కవర్గాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకునే విధంగా అభ్యర్థుల ప్రచారం, ముఖ్యమంత్రి స్థాయిలో జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు భవిష్యత్‌లో చేపట్టనున్న కార్యక్రమాలపై ప్రజలకు వివరించనున్నారు. ప్రతిపక్షాలు కూటమి కొట్లాటలో ఉన్నప్పుడే తెలంగాణ వ్యాప్తంగా భారీ బహిరంగ సభలను నిర్వహించి ప్రతిపక్షాల అడ్రస్‌లను గల్లంతు చేసే విధంగా వ్యూహాలకు కేసీఆర్‌ మరింత పదును పెట్టారు. ఖమ్మంజిల్లాలో నిర్వహించే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలని, గతంలో
ఎన్నడూ లేని విధంగా జిల్లాలో బహిరంగ సభను నిర్వహించే విధంగా పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగు లేటి శ్రీనివాసరెడ్డి సారధ్యంలో నేటి నుంచి బహిరంగ సభ ఏర్పాట్లు జరగనున్నాయి.