ప్రచారంలో ప్రజల స్పందన అపూర్వం

ఎక్కడికి వెళ్లినా సానుకూల స్పందన
16 సీట్లు గెలుస్తామనడానికి ఇదే నిదర్శనం
మంత్రి ఈటెల రాజేందర్‌ వెల్లడి
కరీంనగర్‌,మార్చి29(జ‌నంసాక్షి): కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో టిఆర్‌ఎస్‌ ప్రచారం అద్బుతంగా సాగుతోందని, గతంలో కంటే ప్రజలు మరింత ఆసక్తిగా తమకు మద్దతుగా నిలుస్తున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల
రాజేందర్‌ అన్నారు. ప్రజలు ఎక్కడికి వెళ్లినా ప్రచారంలో తమపట్ల ఆదరాభిమానాలు చూపుతున్నారని అన్నారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా కలకాలం పాలన చేయాలన్న ఆకాంక్షను చాటుతున్నారని చెప్పారు. ప్రచారతీరుపై ఆయన మాట్లాడుతూ కెసిఆర్‌పై ప్రజల నమ్మకం రోజురోజుకూ పెరుగుతోందని, ఢిల్లీలో కూడా మన మాట చెల్లుబాటయ్యేలా దీవిస్తున్నారని ఈటెల చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సంక్షే
మ పథకాలు అమలుచేసి ప్రజల మెప్పుపొంది ఇతర రాష్ట్రాలకు సీఎం కేసీఆర్‌ ఆదర్శంగా నిలిచారనీ అన్నారు. సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అందించాలనే కేసీఆర్‌ ఢిల్లీ వైపు చూస్తున్నారన్న విషయంలో ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొందన్నారు. దేశంలో ప్రధాన పార్టీల తీరుతో ప్రజలు విసిగిపోయారనీ, అందుకే టిఆర్‌ఎస్‌ చెబుతోన్న కారు,16,సర్కార్‌ నినాదంపై ప్రజలు సానుకూలత వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌,బిజెపిలకు  ప్రత్యామ్నాయం కావాలని చూస్తున్నారన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొద్దికాలంలోనే సీఎం కేసీఆర్‌ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు పక్కాగా అమలుచేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలోని ఫెడరల్‌ ఫ్రంట్‌ వైపు దేశప్రజలు మొగ్గు చూపుతున్నారనడానికి ఇంతకన్నా తార్కాణం అవసరం లేదని వివరించారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీకి 100 సీట్లు దాటని పరిస్థితులున్నాయన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ 16 ఎంపీ స్థానాలు గెలుచుకుంటే తెలంగాణ హక్కులు కాపాడుకున్నట్లవుందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధికస్థానాలు గెలిస్తే ఏడాదిలోగా కాళేశ్వరం రివర్స్‌పంపింగ్‌ పనులు, సూరమ్మ రిజర్వాయర్‌ పనులు పూర్తవుతాయన్నారు. వ్యవసాయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని భావించి రాష్ట్రంలోని రైతులకు రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి 10 వేలు, రైతు కుటుంబాలకు ధీమాగా ఉండాలని రైతు భీమా పథకం ప్రవేశపెట్టిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనన్నారు. కరీంనగర్‌ ఎంపీగా బోయినిపెల్లి వినోద్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్న తపన ప్రజల్లో చూశామని అన్నారు. అయోధ్య అంశాన్ని బీజేపీ ఎన్నికల్లో ఓట్లకోసం వాడుకోవాలని చూస్తుందే తప్ప పరిష్కారం చూపలేకపోతున్నారని విమర్శించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీలకు బడ్జెట్‌లో ఎక్కువ ప్రాధాన్యతని చ్చామన్నారు. ప్రతి కార్యకర్త ఇంటింటికి తిరుగుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధి ప్రజలకు వివరించడం ద్వారా ప్రజల నుంచి సానుకూలతను పొందుతున్నామని అన్నారు. అందుకే ఈ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలు తమంతగా తాము ముందుకు వస్తున్నారని అన్నారు.