ప్రచార వ్యూహాలకు పార్టీల పదను

నామినేషన్ల ఘట్టం ముగియడంతో వేడెక్కిన ప్రచారం
మూడు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ
సంగారెడ్డి, మార్చి26(జ‌నంసాక్షి): నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఎన్నికల వేడి ఊపందుకుంది. ఎండలను సైతం లెక్క చేయకుండా నేతలు గ్రామాల బాట పట్టారు. ప్రచారంలో జోరుపెంచారు.  జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం లో మూడు ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీ అభ్యర్థుల మధ్యనే తీవ్ర పోటీ నెలకొననుంది. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి తరుపున మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావులు ఇన్‌చార్జిగా వ్యవహరించనున్నారు. వీరితో పాటు సీఎం కెసిఆర్‌  సైతం జహీరాబాద్‌ నియోజకవర్గ అభ్యర్థి గెలుపుకోసం కృషి చేయనున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి మదన్‌మోహన్‌రావు
తరుపున ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీతో పాటు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌లు మధన్‌మోహన్‌రావు గెలుపు కోసం కృషిచేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డి తరుపున ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మురళీధర్‌గౌడ్‌తో పాటు రాష్ట్ర నాయకులు వచ్చి ప్రచారం చేయనున్నారు. దీంతో ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. దీంతో జహీరాబాద్‌ లోక్‌ సభ నియోజకవర్గ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌, బాన్సువాడ, సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌, ఆందోల్‌, నారయణఖేడ్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయం వేడెక్కింది. ప్రధాన పార్టీల నాయకుల రాకపోకలతో లోక్‌సభ ఎన్నికలకు ప్రచారం వేడెక్కింది. లోక్‌సభ ఎన్నికలు సవిూ పిస్తున్న కొద్దీ ఉమ్మడి జిల్లా రాజకీయం వే డెక్కుతోంది. అభ్యర్థుల ప్రకటన పూర్తవడంతో పాటు సోమవారం నామినేషన్ల గట్టం ముగియడంతో నేతలంతా వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. వివిధ పార్టీల నేతలు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విసృత్తస్థాయి సమావేశాలు నిర్వహిస్తు అభ్యర్థుల గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశర చేస్తున్నారు.
జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజ కవర్గం పరిధిలోని 7 నియోజకవర్గాలకు గాను ఆరు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉండడంతో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని 7 నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు కార్యకర్తల సమావేశాలను నిర్వహించి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బీబీపాటిల్‌ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మదన్‌మోహన్‌రావు మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశాన్ని నిర్వహించారు.  బీజేపీ అభ్యర్థిగా బాణాల లక్ష్మారెడ్డి పోటీకి సిద్ధమై ప్రచారానికి సన్నద్ధం అవుతున్నారు. లోక్‌సభ ఎన్నికలలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రకటనతో జిల్లాలో పార్టీలు ప్రచారంలోకి అడుగుపెట్టాయి.