ప్రచార సరళిపై కడియం ఆరా

విమర్శలకు ఎక్కడికక్కడే సమాధానాలు

ప్రజలను నేరుగా కలుసుకునే ప్రచార వ్యూహం

అభివృద్ది కొనసాగాలంటే కెసిఆర్‌ కావాలన్న నినాదం

వరంగల్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): జిల్లా ప్రచార బాధ్యతలు భుజాన వేసుకున్న ఉపమంత్రి కడియం శ్రీహరి

రోజువారీగా ప్రచార కార్యక్రమాలను కూడా ఆరా తీస్తున్నారు. మరోమంత్రి చందూలాల్‌ ఉన్నా ఆయన తన నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. అలాగే మాజీ స్పీకర్‌ కూడా భూపాలపల్లి నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. దీంతో శ్రీహరి ఒక్కరే అన్ని నియోజకవర్గాల్లో షెడ్యూల్‌ ప్రకారం పర్యటిస్తూ

అభ్యర్థల్లో ఉత్సాహం నింపుతున్నారు. కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించాలని, గ్రామాల్లో ముమ్మర ప్రచారం నిర్వహించాలని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అత్యధిక మెజార్టీతో గెలుపొందేలా పనిచేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి టీఆర్‌ఎస్‌ గెలుపునకు కృషిచేయాలన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లాలన్నారు. విభేదాలకు పోకుండా అందరూ సమన్వయంతో కలిసికట్టుగా ముందుకుపోవాల్సిన అవసరం ఉందన్నారు. దీంతోపాటు టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏ రోజు ఎక్కడెక్కడ ప్రచారం చేస్తున్నదీ, ఏయే అంశాలను ప్రజలకు వివరిస్తున్నదీ సమాచారం సేకరిస్తున్నారు. అవసరమైతే వారికి సూచలను ఇస్తున్నారు. ప్రచార పంథాలో మార్పులు రావాలని సూచిస్తున్నారు. ప్రజలను తమవైపు తిప్పుకునేలా గ్రామాలవారిగా సమాచారం వెంట ఉంచుకోవాలని సూచిస్తున్నారు. నియోజకవర్గాల్లో నాయకులను, గ్రామ పెద్దలను ప్రముఖులను కలసి చర్చించాలన్నారు. టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలపై వెంటనే స్పందించాలని, వారు ఏ సమస్యపై విమర్శ చేసినా ఎక్కడిక్కడనే నేతలు జవాబు చెప్పాలన్నారు. నాలుగున్నరేళ్లలో టీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు స్వాగతిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ప్రజలు కేసీఆర్‌ పాలనను కోరుకుంటున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కోవలో అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో ప్రచారం ముమ్మరం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించాలని నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్తులు కూడా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తండా, గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి మళ్లీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చే విధంగా కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వివిధ రకాల పెన్షన్లు ప్రభుత్వం ఇస్తున్నందున ఆయా పెన్షన్లు వస్తున్నాయా లేదా అని ఆరా తీస్తున్నారు. పింఛన్లు రాని వారితో మాట్లాడి ఎందుకు రావడం లేదో తెలుసుకొన్నారు. వచ్చేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే తెలంగాణ ప్రభుత్వంలోనే జరుగుతాయన్నారు. కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడమే మనందరి లక్ష్యం కావాలన్నారు. అప్పుడే మళ్లీ అభివృద్ది సాగుతుందని చెబుతున్నారు.