ప్రజలకిచ్చిన హావిూలను విస్మరించిన టిఆర్‌ఎస్‌: కటకం

కరీంనగర్‌,అక్టోబర్‌11(జ‌నంసాక్షి): ఉద్యమ కాలంలో చేసిన వాగ్దానాలు, ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన హావిూలను టిఆర్‌ఎస్‌ తుంగలో తొక్కిందని డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అన్నారు. అందుకే కాంగ్రెస్‌ పొత్తులను ప్రశ్నిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..  రాష్ట్రాన్ని మరోసారి కేసీఆర్‌ చేతిలో పెడితే ప్రజలకు అథోగతే అని అన్నారు. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఇది చారిత్రక అవసరం అని అన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. రెండు పడక గదుల ఇళ్లు, రైతులకు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం ఇలా ఎన్నో హావిూలిచ్చి ప్రజలను మోసం చేసిన కేసీఆర్‌ మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారన్నారు. అందుకే కెసిఆర్‌ చెప్పే మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని భావిస్తున్నామన్నారు. అబద్దాలు చెప్పటం కాంగ్రెస్‌కు చేతకాదని, చేసేదే చెప్పి చేసి చూపిస్తామన్నారు. 2004, 2009 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హావిూలన్నింటిని నెరవేర్చామని, ఇపుడు ఈ ఎన్నికల్లో చెప్పే ప్రతి హావిూని నెరవేర్చి తీరతామన్నారు. రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, మహిళా సంఘాలకు రూ.1 లక్ష గ్రాంటుతో పాటు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, యువతకు ఉపాధి, ఇల్లు కట్టుకునే వారికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు.