ప్రజలకు ఆహ్లాదాన్ని అందించడమే లక్ష్యంగా మినీ ట్యాంక్‌ బండ్‌లు

-బాన్సువాడ కల్కి చెరువు ట్యాంక్‌బండ్‌ పనులను పరిశీలించిన మంత్రి పోచారం

కామారెడ్డి,అక్టోబర్‌ 23(జ‌నంసాక్షి): తెలంగాణాలోని ప్రధాన పట్టణాలతోపాటు ఓమోస్తరుగా ప్రజాదరణ ఉన్న గ్రామాల్లో కూడా ప్రజలకు ఆహ్లాదాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో ప్రతి నియోజకవర్గంలో ఒకటి రెండు చెరువులను చేపట్టి మినీ ట్యాంక్‌ బండ్‌లుగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువు వద్ద జరుగుతున్న మినీ ట్యాంక్‌ బండ్‌ పనులను మంత్రి పరిశీలించారు. ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ కల్కి చెరువు అభివృద్దికి ఆరు కోట్ల రూపాయలను కేటాయించామని, పనులు సంతృప్తి కరంగా జరుగుతున్నప్పటికి ఇంకా వేగం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. చెరువుమద్యలోని దిమ్మెపైన తెలంగాణా తల్లి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామన్నారు. ప్రజలు సేద తీరడానికి ప్రత్యేక గొడుగు (హట్స్‌)లు నిర్మిస్తామన్నారు. అంతేకాక కట్టపైన సిమెంట్‌తో బేంచీలు నిర్మిస్తామన్నారు. ప్రత్యేక టైల్స్‌తో వాకింగ్‌ ట్రాక్‌ నిర్మిస్తామన్నారు. ఈ ట్యాంక్‌బండ్‌ చూడడానికి వచ్చే వారి వాహనాలు పార్కింగ్‌ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాక పిల్లలకోసం పార్క్‌ను ఏర్పాటు చేస్తామని, తినుబండారాలు, స్నాక్స్‌కోసం స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అధికారులు కాంట్రాక్టర్లు చిత్తశుద్దితో వ్యవహరించి నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకితీసుకురావాలన్నారు ఆయన వెంట సింగిల్‌ విండోఅద్యక్షుడు కృష్ణారెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నార్ల సురేష్‌ గుప్తా, టీఆర్‌ఎస్‌ నాయకులు మోహన్‌ నాయక్‌, శ్రీనివాస్‌, ఎజాజ్‌, శ్రీదర్‌ తదితరులు పాల్గొన్నారు.