ప్రజలతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తి పోచారం


– వ్యవసాయరంగాన్ని కొత్తపుంతలు తొక్కించారు
– తెరాస సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌
హైదరాబాద్‌, జనవరి18(జ‌నంసాక్షి) : గతంలోనూ, తెరాస హయాంలో నాలుగున్నరేళ్లు వ్యవసాయ మంత్రిగాపనిచేసిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రజల మనస్సులు గెలుచుకున్నారని, ప్రజలతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తి పోచారం అని అలాంటి వ్యక్తి స్పీకర్‌ కావటం మంచి పరిణామనం తెరాస సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన పోచారం శ్రీనివాస్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన సందర్భంగా శాసనసభలో కేటీఆర్‌ మాట్లాడారు. వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చిన కేసీఆర్‌ సీఎం కావడం, పోచారం స్పీకర్‌ కావడం రాష్ట్రాభివృద్ధికి శుభపరిణామం అని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైతులంతా సంబురపడుతున్నారడంలో అతిశయోక్తి లేదన్నారు. పోచారం పనితీరును మెచ్చుకున్న కేసీఆర్‌ ఆయనకు స్వయంగా లక్ష్మీపుత్రుడిగా నామకరణం చేశారు. రాష్ట్రంలో రెండో హరిత విప్లవానికి కూడా పోచారం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే బీజం పడింది అనడంలో ఎలాంటి అతిశయెక్తి లేదని కేటీఆర్‌ పేర్కొన్నారు. రూ.17 వేల కోట్ల రైతురుణమాఫీ చేయడం, 58 లక్షల మంది రైతులకు రైతుబంధు, 38 లక్షల మంది రైతులకు రైతుబీమా ద్వారా భరోసా కల్పించిన ఘనత పోచారం శ్రీనివాస్‌ రెడ్డిదే అని కేటీఆర్‌ పేర్కొన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్‌ ఇచ్చి రైతుల కుటుంబాల్లో సంతోషాన్ని నింపారన్నారు. 4,200 మంది వ్యవసాయ విస్తరణ అధికారులను పోచారం సారథ్యంలో నియమించారని, వ్యవసాయంలో పరిశోధనలకు ఊతమిచ్చే విధంగా కొత్త పుంతలు తొక్కించారని, ఇవన్నీ కూడా పోచారం శ్రీనివాస్‌రెడ్డి హయాంలో జరిగిన కార్యక్రమాలు.. ఈ కార్యక్రమాలన్నీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని కేటీఆర్‌ పేర్కొన్నారు. పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తన వయసును లెక్క చేయకుండా ప్రజలతో సన్నిహితంగా, సత్సంబంధాలు పెట్టుకున్నారు. పోచారం శ్రీనివాస్‌ రెడ్డి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నామన్నారు.  నిత్య విద్యార్థి మాదిరిగా పోచారం శాసనసభలో ఉండిపోయేవారని, ఇది మా అందరికీ స్ఫూర్తిదాయకం, ఆదర్శం అన్నారు. ఒకనాడు పద్దుల చర్చ సందర్భంగా రాత్రి ఒంటిన్నర గంట వరకు అసెంబ్లీ జరిగిందని, ఆ సమయంలో వ్యవసాయ పద్దు విూద పోచారం సమాధానం ఇస్తున్నారని, ప్రశ్నలు అడిగిన ప్రతిపక్ష శాసనసభ్యులు కూడా అక్కడ లేరని, సమాధానాన్ని ఉపక్రమించగానే.. సభ్యులు ఎవరూ లేరు అని కొందరు అనడంతో… హాస్య చతురతతో పోచారం సమాధానం ఇచ్చారని కేటీఆర్‌ గుర్తు చేశారు. సభలో ప్రశ్నలు అడిగిన వారు లేకున్న వారు తమ నివాసాల్లో టీవీల్లో చూస్తుంటారు అని.. వారికి సమాధానం చెప్పాల్సిందేనని ఓపికగా సమాధానం చెప్పారని
కేటీఆర్‌ తెలిపారు.
విూ హయాంలో రైతాంగానికి స్వర్ణయుగం – హరీశ్‌రావు
తెలంగాణ రైతాంగానికి గడిచిన నాలుగున్నరేళ్లు ఒక స్వర్ణయుగమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. స్పీకర్‌గా పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎంపికపై హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ తొలిదశ ఉద్యమం 1969లో ఒక ఉద్యమకారుడిగా, ఒక విద్యార్థి నాయకుడిగా ఉద్యమం చేసి జైళ్ల పడి.. మలిదశ ఉద్యమంలో కేసీఆర్‌ నాయకత్వంలోనే తెలంగాణ సాధ్యమని చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి, పదవికి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో తిరిగి ఉపఎన్నికలో గెలిచి ఉద్యమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఈ తెలంగాణ శాసనసభలో విూరు సభాపతిగా ఆ కూర్చిలో కూర్చొవడం అంటే ఇది విూకే కాదు ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. పని విషయంలో మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఎంతో నేర్చుకునేవాళ్లమని, 69 ఏండ్ల వయస్సులో కూడా 29ఏండ్ల యువకుడిలా పనిచేసేవారని కొనియాడారు. తెలంగాణ రైతాంగానికి గడిచిన నాలుగున్నరేళ్లు ఒక స్వర్ణయుగమని, గొప్ప విప్లవాత్మకమైన మార్పును తీసుకురాగలిగామని అన్నారు. విూ పనితీరు, సీఎం నిర్ణయాలతో స్వామినాథన్‌ లాంటి వ్యవసాయరంగ నిపుణుడే అవార్డు ఇచ్చి రైతాంగానికి చేస్తున్న మేలును గుర్తించారన్నారు. కారే కార్యాలయంగా ఉండేదని, రైతు బంధు అడిగినా, ఇన్సూరెన్స్‌ అడిగినా, రైతు సమన్వయ సమితులు అడిగినా వేళ్లవిూద ప్రతి సమాచారం చెప్పేవారని, అలాంటి నిబద్ధతతో పనిచేసిన వ్యక్తిగా పోచారం నిలిచారన్నారు. నిజాంసాగర్‌ రైతుల కోసం విూరు పడిన తపన.. సింగూరు నుంచి నీటి విడుదల విషయంలో, నిజాంసాగర్‌ ఆధునీకరణ విషయంలో విూ కృషి ఆమోఘమని కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నిజాంసాగర్‌ అనుసంధానం చేయాలని సీఎంతో ఒప్పించి మెప్పించుకున్న తీరు రైతులపట్ల విూ ప్రేమను తెలియజేస్తుందన్నారు. వచ్చే ఐదు సంవత్సరాల పాటు ఈ సభను అత్యంత హుందాగా భారతదేశంలోని మిగతా శాసనసభలకు ఆదర్శవంతమైనటువంటి సభగా తీర్చుదిద్దుతారన్న నమ్మకం తనకుందని హరీశ్‌రావు పేర్కొన్నారు.
రైతుల అభివృద్ధిలో విూ కృషి మరువలేనిది – ఈటెల
రైతుల అభివృద్ధి విషయంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేసిన కృషి మరవలేనిది అని మాజీ మంత్రి, హుజురాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి ఈటల రాజేందర్‌ శుభాకాంక్షలు తెలుపుతూ సభలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసి ప్రజల తీర్పు కోసం పోయినప్పుడు ఉప్ప ఎన్నికల్లో శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పని చేశారన్నారు. ఆసందర్భంగా విూ చిత్తశుద్ది, పని విధానం, ప్రజలతో పెనవేసుకున్న బంధమేందో అర్థమైందన్నారు. విూ జీవితాన్ని తాము స్ఫూర్తిగా తీసుకున్నామన్నారు. ఉద్యమ సమయంలో గొప్పపాత్ర పోషించారని, దేశంలో ధనికుడైన రైతు ఎక్కడున్నారంటే తెలంగాణలో ఉన్నారని చెప్పేందుకు పోచారం శ్రీనివాస్‌రెడ్డి పునాది వేశారని ఈటెల కొనియాడారు. వ్యవసాయమంటే దండుగ కాదు.. పండుగ అని నిరూపించిన విషయంలో పోచారం కృషి మరువలేనిది అని ప్రశంసించారు. మా రైతాంగానికి విూ బ్యాంకర్లు సహకరించడం లేదని ముక్కుసూటిగా పోచారం శ్రీనివాస్‌ రెడ్డి బ్యాంకర్ల సమావేశంలో అడిగేవారన్నారు.  రుణాల విషయంలో విూకు సహకరిస్తామని పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి బ్యాంకర్లు చెప్పేవారని ఈటల రాజేందర్‌ గుర్తు చేశారు. 40ఏండ్ల సుదీర్ఘ అనుభవంతో ఈ సభను స్ఫూర్తిదాయకంగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి నడుపుతారని ఆశిస్తున్నాను అని ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు.