ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

దేశంలో రాజకీయ అనివార్యతలు ఎప్పుడూ అవసరమే. సందర్భమే అందరినీ ఒక్కటి చేస్తుంది. ప్రజాస్వామ్యంలో నిరంకుశానికి తావులేదు. ప్రజల మేలుకోరి చేసే పనులు సజావుగా సాగుతుంటే పాలకులు కొంత నిరంకుశంగా ఉన్నా ప్రజలు భరిస్తారు. చరిత్ర తిరగేస్తే నిరంకుశ పాలకులు మట్టికరిచారు. బిజెపికి ఈ దేశంలో ఓ ప్రత్యేకత ఉండేది. అటల్‌,అద్వానీలో శకం ముగిసిన తరవాత మోడీ పగ్గాలు చేతబట్టాక అంతా గుజరాత్‌ తరహాలో దేశం అభివృద్ది జరుగుతుందని భావించారు. కానీ మోడీ పగ్గాలు చేపట్టాక గానీ తెలియలేదు. గుజరాత్‌ నమూనా ఓ బూటకమని. మోడీ రాక సందర్బంగా ఈ విషయాన్ని విపక్షాలు ప్రచారం చేసినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. పదేళ్ల యూపిఎ పాలనతో విసిగిపోయిన వారు మోడీని చూస్తే సాక్షాత్తూ ప్రజలను రక్షించడానికి వచ్చిన శ్రీమన్నారాయణుడిగా భావించి ఓటేశారు. కానీ నాలుగున్నరేళ్ల కాలం గిర్రున తిరిగింది. వెనక్కి చూసుకుంటే ప్రజల జీవనం వేదనాభరితంగా తయార య్యింది. ముఖ్యమంత్రిగా మూడు పర్యాయాల అనుభవం ఉన్న మోడీ,పగ్గాలు చేపట్టగానే బిజెపిలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా చేసారు. ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నారు. అలాగని దేశాన్ని ఉద్దరించారా అంటే అదీ లేదు. ఏ రాష్ట్రంలో పాగా వేయాలన్న ఆలోచన తప్ప ప్రజల ఆకాంక్షలను ఏనాడు పట్టించుకోవడం లేదు. నిరంకుశంగా వ్యవహరిస్తూ దేశ వ్యవస్థలను భ్రష్టుపట్టించారు. పెద్దనోట్ల రద్దుతో దేశాన్ని ఆర్థికంగా అధోగతి పాలుచేశారు. జిఎస్టీతో వ్యాపారాలను సాగకుండా చేశారు. రుణ ఎగవేతదారులు దర్జాగా దేశం వదిలి పారిపోయారు. కాశ్మీర్‌ మండుతోంది. సరిహద్దుల్లో రక్షణ లేకుండా పోయింది. మొత్తంగా ఓ అనుభవ రాహిత్య నేత దేశానికి చీడపురుగులా పట్టడాన్న ఆందోళన సర్వత్రా కలుగుతోంది. ఇకపోతే బిజెపికి ఉన్న ఉన్నతమైన ఇమేజ్‌ కూడా మంటగలిసింది. బిజెపిని అభిమానించే వారు సైతం ఇప్పుడు ఛీ కొడుతున్నారు. ఈ దశలో కేంద్ర రాజకీయాల్లో కదలిక వచ్చింది. చంద్రబాబు మళ్లీ రాజకీయ చక్రం చేతబూని చెట్టుకొకరు, పుట్టకొకరుగా ఉన్న వారిని చేరదీసి గూడుకట్టే ప్రయత్నం చేపట్టారు. ఆ ప్రయత్నం లో భాగంగానే కాంగ్రెస్‌ నేత రాహుల్‌తో కలసారు. శరద్‌ పవార్‌, ఫరూక్‌ అబ్దుల్లా, సీతారం ఏచూరి, అజిత్‌ సింగ్‌,ములాయం లాంటి నేతలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టారు. మోడీ హఠావో.. దేశ్‌కో బచావో నినాదం ఇక ఊపందుకోనుంది. ఎక్కడో ఒక దగ్గర ఓ అడుగు పడితే అది ముందుకు కదులుతుంది. దాని వెనక మరో పది అడుగులు పడతాయి. ముళ్లబాట కాస్తా రాచబాటగా మారుతుంది. దేశంలో రాజకీయ కదలికకు ఇది పునాది అవుతుందనడంలో సందేహం లేదు. దేశ రాజకీయాలు భ్రష్టుపట్టి పోయాయని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అసవరం లేదు. ఈ దేశాన్ని భ్రష్టు పట్టించేంతగా రాజకీయ పార్టీలు, వాటినేతలు తమవంతుగా పనిచేశారు. ప్రజలతో సంబంధం లేకుండా పాలన సాగుతోంది. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప, దేశ ప్రజల ఆశలు,ఆకాంక్షలు నెరవేర్చేలా, ప్రపంచానికి మార్గనిర్దేశనం చేసేలా పాలన సాగడం లేదు. దీనిపై విస్తృత చర్చ సాగాలి. సంప్రదాయ రాజకీయాలకు చరమగీతం పాడాలి. మోడీ అధికారం చేపట్టడానికి ముందు ప్రజలు ఇదే ఆశించారు. బిజెపి అధికారంలోకి వస్తే ఇదే జరుగుతందని భావించారు. మార్పు తథ్యమనుకున్నారు. కానీ మార్పు మరో రకంగా ఉంది. ప్రజలతో సంబంధిం లేని మార్పులు చోటుచేసుకున్నాయి. కుంభకోణాలు కొత్తగా పుట్టుకు వచ్చాయి. బ్యాంకులను దివాళా తీయించేలా గద్దల్లాగా ప్రజల డబ్బును తన్నేసుకుని పోతున్నా కళ్లప్పగించి చూశారు. ఇక వీరు ఆర్థిక సంస్కరణల గురించి చెప్పడం ప్రజాద్రోహం తప్ప మరోటి కాదు. కాంగ్రెస్‌కు తీసిపోని విధంగా మోడీ పాలన సాగుతోంది. అంతేగాకుండా బిజెపికి ప్రజల్లో ఉన్న ఇమేజ్‌ మొత్తం చెరిగిపోయింది. బిజెపి తమ

ఘనతగా చెప్పుకోవడానికి ఏవిూ మిగలనంతగా మోడీ పాలన సాగుతోంది. నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజల కష్టాలు పెనం విూంచి పొయ్యిలో పడ్డ చందంగా మారింది. అందుకే ప్రజలు మోడీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. తమకు ఈ పాలనలో కూడా ఊరడింపు దక్కదని తేలిపోయింది. కార్పోరేట్‌ శక్తులకు తలొగ్గిన ప్రభుత్వం వారు చెప్పినట్లుగానే నడుచుకుంటోందనడానికి వీలుగా పాలన తీరు ఉంది. ఎంతగా అంటే రక్షణ రంగంలో రఫేల్‌ కుంభకోణం ఇప్పుడు దేశప్రతిష్టను దిగజార్చేంతగా ప్రచారం సాగుతున్నా పాలకుడిగా మోడీ పెదవి విప్పడం లేదు. మన్మోహన్‌ సింగ్‌ను మౌనముని అని విమర్వించిన మోడీ ఏ విషయంలోనూ పెదవి విప్పి మాట్లాడడం లేదు. ఆర్థికంగా దేశం ఒడిదుడుకుల్లో ఉంది. ధరలు అదుపుతప్పాయి.నిరుద్యోగం పెరిగింది. వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. స్వాతంత్య్రానంతనరం 70 సంవత్సరాల ప్రయాణం సాగించిన తర్వాత దేశం ఎటుపోతోందని చూస్తే అవినీతిలో కూరుకుపోయింది. నిరుద్యోగం పెరుగుతోంది. కేంద్ర రాష్ట్రాల మధ్య పొందిక కుదరడం లేదు. దేశంలో రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయన్న దానిపై ఆత్మవిమర్శ లేదా అధ్యయనం జరగడం లేదు. నీటి వాటాలు తేల్చరు. అనేక సమస్యలు పరిష్కరించరు. దేశంలో పేదరికం పోవాలంటే కష్టపడి పనిచేసే విధంగా మార్పు రావాలి. ఉచిత పథకాలతో ప్రజలను నిస్తేజులను చేసే వాటికి చరమగీతం పాడాలి. సరికొత్త రాజకీయ విప్లవం సాధించగలగాలి. చంద్రబాబు రాజకీయ కూటమి కట్టడమే గాకుండా ఇలాంటి సమస్యలపై ముందు స్పష్టమైన ప్రకటన చేయాలి. నియంతను పారదోలడమొక్కటే పరిష్కారం కాదు…దేశం ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలపై చర్చించాలి. వాటిపై స్పష్టత ఇవ్వాలి. తాము అధికార మార్పిడి మాత్రమే గాకుండా ప్రజల కోసం మార్పు తీసుకుని వస్తామని శపథం చేయాలి. అప్పుడే ప్రజలు నమ్ముతారు. కూటమి కట్టినా విజయం సాధిస్తారు.