ప్రజల్లోకి అభివృద్ది కార్యక్రమాలు : జలగం

కొత్తగూడెం,మార్చి17(జ‌నంసాక్షి): రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని  మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్‌ అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా రాష్ట్రాన్ని పారిశ్రామికంగానే కాకుండా మౌలిక సౌకర్యాల కల్పనలో, నిరుపేదలకు అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్‌ అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రం ఏర్పాటైన తరువాత అతి తక్కువ సమయంలో అతి పెద్ద ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని పేర్కొన్నారు. ఆసరా పథకం ద్వారా వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు అండగా నిలిచారని తెలిపారు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా ఇచ్చే కార్యక్రమం ఈ ఏడాది చివరి నాటికి కార్యరూపం దాలుస్తుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మిషన్‌ భగీరథతో  తాగునీటి సౌకర్యం కోసం వేల కోట్లు ఖర్చుచేస్తున్నారని అన్నారు.  ప్రజలు పనిచేసే వారినే అడుగుతారని, చేయని వారిని అడగరని, ఈ వాస్తవాన్ని కార్యకర్తలు, నాయకులు గుర్తించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేయాలని పేర్కొన్నారు. గ్రావిూణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తానని తెలిపారు.  ఖాళీగా ఉన్న స్థలాలను రానున్న రోజుల్లో చిన్నతరహా పరిశ్రమల కోసం కేటాయించేందుకు, తద్వారా ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు.