ప్రజల్లో స్పందన బాగుంది

 

కూటమికి ఓటమి తప్పదన్న తలసాని

హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ సనత్‌నగర్‌ అభ్యర్తి, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. మాయా కూటమికి ప్రజలు గట్టి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. నియోజకవర్గంలోని భోలక్‌పూర్‌లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన తలసానికి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. స్థానిక మహిళలు బతుకమ్మలు, బోనాలతో ఆయనకు స్వాగతం పలికారు. ప్రచారంలో భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ

మహాకూటమికి ఎన్నికలకు ముందే ఓటమి భయం పట్టుకున్నదని.. కనీసం సకాలంలో అభ్యర్థులను ప్రకటించలేని దుస్థితిలో పార్టీలు ఉన్నాయని అన్నారు.టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం చేపట్టారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజల స్పందన చూస్తుంటే టీఆర్‌ఎస్‌ పార్టీకి రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీ ఖాయమని తెలుస్తుందన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు సాదరంగా ఆహ్వానిస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలు బాగున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఏ ప్రభుత్వం కూడా ప్రజల సంక్షేమం కోసం ఇన్ని పథకాలను ప్రవేశ పెట్టలేదన్నారు. ఆసరా పింఛన్ల పై వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు సంతోషంగా ఉన్నారన్నారు. పింఛన్లను రూ. 2016కు పెంచుతామని ప్రకటించగానే పింఛన్‌దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ కిట్‌ పథకాలను ప్రవేశ పెట్టి ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్యను పెంచారన్నారు.