ప్రజల పక్షాన పోరాడతాం: రేవంత్‌

కొడంగల్: తెలంగాణ ఎన్నికల ఫలితాల ట్రెండ్ టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ గెలుపు .. తెలంగాణ ఆత్మగౌరవానికి, స్వయం పాలనకు, అభివృద్ధికి విఘాతం కల్గించేలా ఉందన్నారు. ఓడిపోయినా ప్రజా క్షేత్రంలోనే ఉంటానని రేవంత్ చెప్పారు. ఓడిపోతే కుంగిపోమని, గెలిస్తే పొంగిపోమని అన్నారు. గెలుపును, ఓటమిని తాను సమానంగా స్వీకరిస్తానని రేవంత్ రెడ్డి అన్నారు. గెలిస్తే తమకు ప్రజలు మరింత బాధ్యత ఇచ్చారనుకునే వాళ్లమని ఆయన అన్నారు. కానీ ఓడినా ప్రజా క్షేత్రంలోనే ఉంటూ.. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని రేవంత్ అన్నారు.
ఎన్నికల్లో ఏమైనా అక్రమాలు జరిగాయా ..? టీఆర్ఎస్ ఏమైనా గోల్‌మాల్ చేసిందా? అనే విషయంపై విశ్లేషించుకున్న తర్వాత స్పందిస్తామని ఆయన రేవంత్ తెలిపారు. ‘‘ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి వంటి వారే రాజకీయాల్లో ఓడారు.. గెలిచారు’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే దోపిడీకి లైసెన్స్ ఇచ్చినట్లుగా కేసీఆర్ భావించవద్దని ఆయన అన్నారు.
    తెలంగాణ ప్రజల పట్ల మరింత బాధ్యతగా కేసీఆర్ పాలన చేస్తారని ఆశిస్తున్నట్లు రేవంత్ తెలిపారు. తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు.. అమరుల కుటుంబాలకు కేసీఆర్ ఇప్పడికైనా న్యాయం చేయాలని రేవంత్ కోరారు. కేసీఆర్.. ఫామ్ హౌస్‌లో బంది అయినా పాలనను ఇప్పటికైనా సచివాలయానికి తీసుకొస్తారని ఆశిస్తున్నట్లు రేవంత్ తెలిపారు.
రాజకీయ సన్యాసం విషయంలో రేవంత్ ఈ విధంగా స్పందించారు. ‘‘నా సవాల్‌పై కేటీఆర్ స్పందించలేదు.. కేటీఆర్ స్పందనపైనే నా నిర్ణయం ఉంటుంది. నాపై ఎన్నో అక్రమకేసులు పెట్టారు. స్వప్రయోజన కోసం రాజకీయాల్లోకి రాలేదు. ప్రజల కోసమే ఉన్నా ..ప్రజల్లోనే ఉంటా’’ అన్నారు.