ప్రజల మనసులను గెల్చుకోవాలి

లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరవాత అన్నిరాజకీయ పార్టీలు గుణపాఠం నేర్చుకోవాల్సిన అసవరం ఎంతయినా ఉంది. నేలవిడిచి సాము చేయకుండా ప్రజలను గుర్తెరిగి కార్యక్రమాలను, కార్యాచరణను చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేసుకోవాలి. కొత్తగా ఎపిలో కొలువుతీరుతున్న జగన్‌ ప్రభుత్వం కావచ్చు.. లేదా కేంద్రంలో పగ్గాలు చేపట్టిన మోడీ కావచ్చు.. తెలంగాణలో కెసిఆర్‌ సర్కార్‌ కావచ్చు.. ప్రజల విషయంలో ఏమరుపాటు ఉండకుండా చూసు కోవాలి. ప్రధానంగా చిన్న సమస్యనైనా పరిష్కిరించే సత్తా చాటాల్సిన అవసరాన్ని గుర్తించాలి. గతంలో మోడీ తీసుకున్న జిఎస్టీ కారణంగా ఇప్పటి ప్రజలు ఇబ్బందు లు పడుతున్నారు. వాటిని సవిూక్షించుకోవాల్సి ఉంది. అలాగే నోట్ల రద్దు కారణంగా ఏర్పడ్డ ఇక్కట్లను మననం చేసుకోవాలి. అలాగే తెలంగాణలో సిఎం కెసిఆర్‌ నిజామబాద్‌ రైతుల సమస్యలను తీవ్రంగా పరిగణించి అవి పరిష్కరించడానికి చిత్తశుద్దితో పనిచేయాలి. అలాగే నిజాం షుగర్స్‌ వంటి కర్మాగారాన్ని తెరిపించే యత్నాలు చేయాలి. ఎపిలో రాజధాని పేరుతో పచ్చటి పొలాలను బెదిరించి లాక్కున్నారు. ఇలా చెప్పకుంటూ పోతే ఒక్కో రాష్ట్రంలో అనేకానేక సమస్యలు ఉన్నాయి. పాలకులు తమకు నచ్చిన పనులనే ఎంచుకుని ముందుకు సాగకుండా ప్రజలకు నచ్చే విధంగా పరిష్కారం చూపగలి గితే వారి గుండెల్లో నిలిచిపోతారు. ప్రజలకూ ప్రభుత్వానికి మధ్య ఉన్న అనుబంధాన్ని గమనించ గలిగితే ఓటమి అన్నది ఉండదు. అలాగే ఐదేళ్ల కాలంలో అద్భుత విజయాలు సాధించవచ్చు. అప్పుడు ప్రజలను ఓట్ల కోసం దేబురించాల్సిన ఆగత్యం కూడా రాదు. వారే వెంటపడి ఓట్లేస్తారు. విపరీత పరిస్తితుల్లో కూడా ప్రజలు మోడీని ఆదరించారు. అక్కున చేర్చుకున్నారు. ప్రారంభంలో బిజెపి కూడా మోదీ సునావిూ వీస్తుందని ఊహించలేకపోయింది. యుపిలో కొన్ని తగ్గినా పశ్చిమ బెంగాల్‌, ఒడిషాలో గతంలో కంటే ఎక్కువ సీట్లు సంపాదిస్తుందని అనేకమంది ఊహించారు. యుపిలోనే కాదు, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్రలలో కూడా బిజెపి ప్రభంజనం సృష్టించింది. ఉత్తరాది రాష్టాల్లో బిజెపికి జరిగే నష్టాన్ని ఒడిషా, బెంగాల్‌లలో పూరించుకుంటామని అప్పుడే స్పష్టీకరించారు. తమిళనాడులో డిఎంకె మెజారిటీ లోక్‌సభ సీట్లు గెలుచుకోగా, కేవలం అన్నాడిఎంకె మాత్రమే తన ప్రభుత్వ మనుగడకు అవసరమైన పది ఎమ్మెల్యే సీట్లు ఎలా గెలుచుకుందీ; అమేథీలో రాహుల్‌ గాంధీ, గుణలో జ్యోతిరాదిత్య సింధియా ఎలా ఓడిపోయారు; ఒడిషాలో కేవలం 23 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న బిజెపి లోక్‌సభలో 8 సీట్లు ఎలా సాధించిందీ; చెరకు రైతుల్లో బలమైన మద్దతు ఉన్న శరద్‌ పవార్‌ పార్టీ నాలుగు సీట్లకు ఎలా కుదించుకుపోయిందీ గుణపాఠాలు కావాలి. తమిళనాడులో జయమరణం తరవాత పాలనా పగ్గాలు చేపట్టిన పళనిస్వామిపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతూ వస్తోంది. డిఎంకె పట్ల ఆదరణ పెరిగింది. ఇది అక్కడి పాలకులకు కనువిప్పు కావాలి. కొన్ని రాష్టాల్లో ఆరునెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలకూ, లోక్‌ సభ ఎన్నికలకూ ఫలితాలు తారుమార య్యాయి. తెలంగాణనే తీసుకుంటే కాంగ్రెస్‌, బిజెపిలు కలసి ఏడు ఎంపి సీట్లు ఎగురేసుకుని పోయాయి. దీనిని ఏవో లెక్కలు గట్టి మాకే ఓట్లు పెరగియాని కెటిఆర్‌ చెప్పడం సరికాదు. అనూహ్యంగా కొంతమంది హేమాహేవిూలు సైతం ఎలా ఓడిపోయారు కవిత, వినోద్‌ కుమార్‌ల ఓటమిని తక్కువచేసి మాట్లాడుతున్న తీరు కూడా సరికాదు. కెటిఆర్‌ వ్‌ఆయఖ్యలపై చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అంతే కాదు, అంచనాలకు అతీతంగా పట్ణణాల్లోనే కాదు, గ్రామాల్లోను, అనేక సామాజిక వర్గాల్లోనూ బిజెపి విస్తరించింది. కులాలకు అతీతంగా జనం బిజెపిని ఆదరించి ఎక్కడా ఓట్లు చీలకుండా జాగ్రత్త పడ్డారు. ముస్లింలు కూడా బిజెపికి ఓటు వేశారని అంచనాలు వెల్లడిస్తున్నాయి. అయితే సీట్లు సాధించినా, సాధించకపోయినా ప్రజలను తక్కువ

చేయడమో లేదా పట్టించుకోక పోవడమో సరికాదు. ఈ ఫలితాలు ఆధారంగా ప్రజలకు మరింవతగా చేరువ కావడానికి ప్రణాళికలు వేసుకోవాలి. ఎన్డీఏకు మెజారిటీ తగ్గిపోతుందని, ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తామని జగన్‌,చంద్రబాబు, కెసిఆర్‌ సహా మమతా బెనర్జీ లాంటి వారు చెప్పారు. ఇదే అభిప్రాయం ఏర్పడడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ కూడా అందుకు తగ్గట్లు వ్యూహరచన చేశారు. మోదీ వైఖరిని అనతికాలంలోనే అర్థం చేసుకున్న కెసిఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌కు చారిత్రక అవసరం ఏర్పడుతుందని ఊహించారు. ఆయనే కాదు, ఎన్నో ఏళ్లు రాజకీయ అనుభవం ఉన్న మరాఠా నేత శరద్‌ పవార్‌ కూడా ఎన్డీఏకు మెజారిటీ రాదని అంచనా వేశారు. ఫలితాలు ప్రకటించేముందు ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు ఆయన కెసిఆర్‌, నవీన్‌ పట్నాయక్‌లతో మాట్లాడారు. ఎగ్జిట్‌ పోల్స్‌ బూటకమని, మోదీ నియంత్రణలో ఉన్న టీవీ ఛానెల్స్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ప్రాంతీయ పార్టీల నేతలు ఎన్డీఏకు మెజారిటీ రాకూడదని,రాదని భావించారు. కేంద్రంలో తిరుగులేని నేత ఉంటే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారని, ప్రాంతీయ పార్టీలకు మనుగడ ఉండదని, తమ అవసరాలను అర్థం చేసుకోలేరని, తమను నియంత్రిస్తారని అంతా భావించారు. అయితే ఇక్కడ ప్రజల మనోభావాలు మరో రకంగా ఉన్నాయని గుర్తించాలి. కేంద్రంలో బలమైన, సమర్థమైన ప్రబుత్వం ఉండాలని అంతా కోరుకున్నారు. అందుకే కాంగ్రెస్‌ సహా ప్రాంతీయ పార్టీలను ప్రజలు దెబ్బకొట్టారు. భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి దేశమంతటా మోదీ అనుకూల ప్రభంజనం వీచిందని, ఆయనకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయాన్ని ఏర్పర్చడంలో విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్‌ విఫలమైందని భావించడం ఒక ఎత్తయితే, ప్రజల మనోగతాన్ని తెలుసుకోవంలో విపక్షాలు పూర్తిగా విపలమయ్యాయి. ఈ ఫలితాలు గెలిచిన వారికి, ఓడిన వారికీ గుణపాఠం కావాలి. ప్రజల ఆశయాలను అనుగుణంగా పాలన సాగకుంటే దూరం పెడతారని గుర్తించాలి. తక్షణ సమస్యలను పరిష్కరించే చొరవతో ముందుకు సాగడం ద్వారా ప్రజల మనసులను గెల్చుకోవాలి.