ప్రజాఆశీర్వాద సభలు విజయవంతం

అభ్యర్థుల్లో గెలుపుపై పెరిగిన భరోసా
మెదక్‌,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): ప్రజాఆశీర్వాద సభలు విజయవంతంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొన్నది. ఇటీవల నర్సాపూర్‌, మెదక్‌ నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రసంగం అభ్యర్థుల్లో భరోసా నింపింది.  గత నెల 21, 28న మెదక్‌, నర్సాపూర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలకు అంచనాలకు మించి భారీగా జనాలు తరలిరాగా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నర్సాపూర్‌, మెదక్‌ సభల్లో నాలుగున్నరేండ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే పథకాలు, సంస్కరణలు స్థానిక అంశాలను ప్రస్తావిస్తూ సభలో ప్రసంగించి సభకు హాజరైన వేలాది మంది ప్రజలను ఆకట్టుకున్నారు. మెదక్‌, నర్సాపూర్‌ నియోజకవర్గాల అభివృద్ధి బాధ్యత తనదేనని ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ భరోసా ఇచ్చారుటీఆర్‌ఎస్‌ ప్రభంజనాన్ని చూసి ఓర్వలేకే కాంగ్రెస్‌ నాయకులు విమర్శలు చేస్తున్నారని ప్రచారంలో టిఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు.  టీఆర్‌ఎస్‌ విజయాన్ని  ఆపలేరని,మెదక్‌లో  పద్మాదేవేందర్‌రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించి తీరుతామని పేర్కొన్నారు. దుబ్బాక టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.  గడపగడపకు వెళ్లి సోలిపేట రామలింగారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ప్రజా ఆశీర్వాద సభల విజయవంతంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. జిల్లాలో మొదటగా ఈ నెల 21న మెదక్‌లో నిర్వహించిన బహిరంగ సభకు జనం భారీగా తరలివచ్చిన విషయం విదితమే. సీఎం కేసీఆర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి తన బిడ్డలాంటిదని, మెదక్‌ అభివృద్ధి తన బాధ్యత అని చెప్పడంతో ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. రెండో సభ ఈ నెల 28న నర్సాపూర్‌లో నిర్వహించగా జనం కిక్కిరిసారు. నర్సాపూర్‌ అభ్యర్థి మదన్‌రెడ్డి తనకు ఆత్మీయుడని, తన ఇంటి సభ్యుడు లాంటి వాడని చెబుతూ.. అటవీ భూముల సమస్య తీరుస్తానని, మాసాయిపేటను మండల కేంద్రంగా మారుస్తానని, లక్ష ఎకరాలకు నీళ్లిస్తానని హావిూ ఇవ్వడంతో జనం కేరింతలు కొట్టారు. అదేరోజు అందోల్‌, నారాయణఖేడ్‌లలో జరిగిన సభల్లో ఇచ్చిన హావిూలపై కూడా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ సభల విజయవంతంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో పాల్గొంటున్నాయి. ముఖ్యంగా వ్యవసాయాధారిత జిల్లా అయిన మెతుకు సీమ వ్యవసాయరంగ అభివృద్ధికి తీసుకున్న, తీసుకుబోయే చర్యలను ముఖ్యమంత్రి రెండు సభలలో ప్రస్తావించడంతో రైతులను ఆలోచింపజేసింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వంద కోట్లు ఘనపూర్‌ ప్రాజెక్ట్‌ ఆధునీకికరణకు కేటాయిస్తే 58 సంవత్సరాల కాంగ్రెస్‌, టీడీపీ హయాంలో ఒక్క పైసా ప్రాజెక్ట్‌ అభివృద్ధికి కేటాయించకపోవడం చర్చకు వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2014 ఎన్నికల్లో మెదక్‌ను జిల్లా చేస్తానని హావిూ ఇచ్చి అమలు పరిచారు. పద్మాదేవెందర్‌రెడ్డి పట్టుబట్టి జిల్లాను సాధించారని , ఆశీర్వదించి ప్రజలు మళ్లీ లక్ష మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.నర్సాపూర్‌ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆగవు ఈ ప్రాంత అభివృద్ధి తన బాధ్యతని చెప్పడంతో నియోజకవర్గ ప్రజలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మదన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెబుతున్నారు. ఆశీర్వాద సభలు మెదక్‌, నర్సాపూర్‌లలో అభ్యర్థులకు పూర్తి గెలుపుపై భరోసా నింపింది. పార్టీ శ్రేణుల్లో జోష్‌ పెంచింది.