ప్రజాప్రతినిధుల కేసులు సత్వరం పరిష్కరించండి

  • సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు

దిల్లీ,సెప్టెంబరు 17(జనంసాక్షి):దేశంలోని ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధుల కేసుల సత్వర విచారణపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసుల విచారణకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి వారం రోజుల్లో పంపాలని అన్ని రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. జిల్లాల్లో పెండింగ్‌ కేసులు, ప్రత్యేక కోర్టులను పరిగణనలోకి తీసుకోవాలని..ఆ మేరకు ప్రణాళిక రూపొందించాలని సూచించింది. విచారణ సమయం, కోర్టుల మధ్య దూరం, మౌలిక వసతులు చూడాలని ఆదేశించింది. ఈ కేసులను ప్రత్యేక కోర్టులకు పంపాలా వద్దా? అనేదానిపై సీజేలు నిర్ణయం తీసుకోవాలని.. అన్ని కేసుల పర్యవేక్షణకు హైకోర్టులో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. స్టే ఉన్న కేసుల్లో సుప్రీం తీర్పుల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని.. స్టే అవసరమైన కేసుల్లో రోజువారీ విచారణ చేపట్టి 2 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. కరోనా వల్ల విచారణ వాయిదా వేయకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. వీడియో కాన్ఫరెన్స్‌ వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విచారణ కొనసాగించాలని సూచించింది. అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.