ప్రజారాజ్యం ఏర్పాటు చేయబోతున్నాం

నాలుగేళ్ల నిరంకుశ పాలనను విముక్తం చేస్తాం: భట్టి

ఖమ్మం,నవంబర్‌19(జ‌నంసాక్షి): నలుగురు కుటుంబసభ్యుల దోపిడీతో తెలంగాణ నలుగుతోందని కాంగ్రెస్‌ నేత మల్లు భట్టివిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని నుంచి తెలంగాణను విముక్తం చేసి ప్రజారాజ్యం స్థాపించబోతున్నామని అన్నారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారని, పంటలకు మద్దతుధర అడిగితే రైతులకు బేడీలు వేశారని దుయ్యబట్టారు. ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.. అందరికీ న్యాయం చేస్తామని భట్టివిక్రమార్క భరోసా ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ పిల్లకాకిలా మాట్లాడారని కాంగ్రెస్‌ నేత మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు. మధిరలో ప్రచారసభలో విక్రమార్క మాట్లాడుతూ మధిరకు ఏం చేయలేదని కేటీఆర్‌ విమర్శించారని, మధిరలో రోడ్లు, నీళ్లు పారే పొలాలను చూస్తే.. తాను చేసిన అభివృద్ధి ఏంటో తెలుస్తుందన్నారు. గెలుపు కాదు.. మధిర గేటును కూడా ముట్టుకోలేరని అన్నారు. దోపిడీ చేసిన డబ్బు సంచులతో కేటీఆర్‌ తిరుగుతున్నారని, మధిర ప్రజలు నీ సంగతి ఏంటో ఎన్నికల్లో తేలుస్తారని ఆయన హెచ్చరించారు. దళితులకు 3ఎకరాలు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, ఇంటికో ఉద్యోగం.. నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తామని మోసం చేశారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ, పెన్షన్లు, ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ ఇచ్చామని, మధిరలో ఒక్క రోడ్డు వేయడానికి నాలుగేళ్లు పట్టిందని ఎద్దేవాచేశారు. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వచ్చారని భట్టి నిలదీశారు.