ప్రజాస్వామ్యం ఖూనీ..

– లోక్‌సభలో రాహుల్‌గాంధీ

– పార్లమెంట్‌ ఆవరణలో కాంగ్రెస్‌ ఎంపీల నిరసన

న్యూఢిల్లీ, నవంబర్‌ 26(జనంసాక్షి): మహారాష్ట్రలో ఎన్సీపీ చీలిక వర్గంతో కలిసి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటును నిరసిస్తూ పార్లమెంట్‌ ఆవరణలో సోమవారం కాంగ్రెస్‌ ఎంపీలు నిరసన ప్రదర్శన చేపట్టారు. నిరసన ప్రదర్శనకు కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక చీఫ్‌ సోనియా గాంధీ నేతృత్వం వహించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ఆపాలని, చౌకబారు రాజకీయాలు మానుకోవాలని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. నిరసన ప్రదర్శనలో పార్టీ సీనియర్‌ నేతలు అహ్మద్‌ పటేల్‌, ఆనంద్‌ శర్మ, అంబికా సోని తదితరులు పాల్గొన్నారు. ఇక లోక్‌సభలోనూ మహారాష్ట్ర పరిణామాలపై కాంగ్రెస్‌ ఆందోళన చేపట్టింది. మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ ఆందోళనతో లోక్‌సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. లోక్‌సభలో రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని అన్నారు. ఇవాళ ఓ ప్రశ్న వేద్దామని అనుకున్నా.. కానీ మహారాష్ట్రలో జరిగిన పరిణామాలు చూస్తుంటే.. ఎటువంటి ప్రశ్నలు వేయాలని అనిపించడంలేదన్నారు. ఎందుకంటే మహారాష్ట్రలో ప్రజాస్వామ్యం హత్యకు గురైందన్నారు. మహా పరిణామాల పట్ల రాహుల్‌తో పాటు సోనియా కూడా నిరసన వ్యక్తం చేశారు.