ప్రజాస్వామ్య విరుద్దంగా మున్సిపల్‌ చట్టం

విపక్షాలను విశ్వాసంలోకి తీసుకోని సిఎం: కటకం
కరీంనగర్‌,జూలై25(జ‌నంసాక్షి): కొత్త మునిసిపల్‌ చట్టం ప్రజాస్వామ్య, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయం ఆరోపించారు. అన్ని పక్షాలను విశ్వాసంలోకి తీసుకుని మంచి ప్రయత్నం చేయాలన్న ఆలోచన సిఎం కెసిఆర్‌కు ఏనాడూ లేదన్నారు. కేవలం విపక్షాలను
ఎండగట్టడం, వారిని తక్కువ చేసి మాట్లాడడమే ఆయనకు తెలుసన్నారు. ప్రజాప్రతినిధులను కాదని కలెక్టర్లకు అధికారాలు కట్టబెట్టాలని చూడటం గ్రామస్వరాజ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. గవర్నర్‌ అందుకే దీనిపై భ్యంతరాలు  వ్యక్తం చేశారని అన్నారు. కేసీఆర్‌ నిర్ణయాలు నిరంకుశ విధానాలకు నిదర్శనమని అన్నారు. ఇలాంటి నిర్ణయాలను తీసుకునే ముందుకు అఖిలపక్షం నేతలతో చర్చిస్తే బాగుండేదన్నారు. మునిసిపల్‌ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గించడం సరికాదని, 33 శాతం రిజర్వేషన్లను అమలు చేయాల్సిందేనని చేశారు. బీసీలకు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయని, రాష్ట్రంలోనూ అమలు చేయాలని కోరారు. తెలంగాణలో గత 20 ఏళ్లలో ఎన్నడూలేనంత కరువు నెలకొందని, కరువు దుర్భిక్షంపై  ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రానికి నివేదిక పంపించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలోని కరువుపై ప్రజాప్రతినిధులు సిఎం కెసిఆర్‌తో మాట్లాడాలని అన్నారు. భూ ప్రక్షాళన తప్పులతడకగా మారి రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ అవినీతి మయమైందన్నారు.