ప్రజా ఎజెండాను నిర్దేశం చేసిన కెసిఆర్‌

ప్లీనరీ అంటే పండగ చేసుకోవడం కాదు…కలసి ఎంజాయ్‌ చేయడం అంతకన్నా కాదు. ఎత్తుకున్న బాధ్యతలను సరిగా నిర్వహిస్తున్నామా లేదా అన్నది విశ్లేషించుకుని..ఇక ముందు ఏం చేయాలనే దానిపై మథనం చేయడం. ఖమ్మంలో జరిగిన టిఆర్‌ఎస్‌ ప్లీనరీ కూడా సరిగ్గా ఇదే చేసింది. ఉద్యమ పార్టీ కనుక దానికి కొన్ని నిర్దేశిత లక్ష్యాలు ఉన్నాయి. ఉద్యమ నాయకుడిగా ఉన్న వ్యక్తే సిఎం కావడం వల్ల సమస్యలు, వాటి పరిష్కారాలపై కెసిఆర్‌కు సంపూర్ణ అవగాహన ఉంది. గత రెండేళ్లుగా తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు చేరవేసి తెలంగాణను బంగారు తునక చేయడమే లక్ష్యమన్న నిబద్దతకు కట్టుబడి పనిచేస్తున్నారు. అందులో సందేహం అవసరం లేదు. అయితే సిఎంగా తాను ఒక్కడే చెప్పిన పనులన్నీ చేయలేడు. తెలంగాణలో తిరుగలేని రాజకీయ శక్తిగా ఎదగిన టిఆర్‌ఎస్‌ కార్యకర్తలపై ఇప్పుడు బాధ్యత పెరిగింది. ప్రభుత్వం ప్రకటించిన కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా అన్నది నిశితంగా పరిశీలన చేసుకోవాలి. కేవలం పదవుల కోసం జెండాలు మోయకుండా ప్రజల ఎజెండాను అధినేత ముందు పెట్టాలి.ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల అమలులో అధికారుల అలసత్వం లేదా అవినీతి ఉంటే వాచ్‌డాగ్‌లా పనిచేసి అధినేతకు చేరవేయాలి. సిఎం కెసిఆర్‌ కూడా ఇదే కోరుకుంటున్నారు. కళ్యాణలక్ష్మి పథకాన్ని తీసుకుంటే ఇందులో అప్పుడే అవినీతి చెద పుట్టింది. ఇలాంటి అవినీతి దరిచేరకుండా అధినేత కలలను సాకారం చేయాలంటే కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. నిజానికి సిబిసిఐడిలాగా పనిచేయాలి. టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు చూస్తే దొరికిపోతామన్న భయం గ్రామాల్లో కలగాలి. అప్పుడే పథకాలు ప్రజలకు నేరుగా చేరి మనం కోరుకున్న బంగారు తెలంగాణ ఆవిష్కృతం అవుతుంది. అంతేకానీ అవినీతిలో కార్యకర్తలు,నేతలు భాగస్వాములయితే కెసిఆర్‌ ఎన్ని కలలు కన్నా, ఎన్ని నిధులు విడుదల చేసినా స్వప్నం సాకారం కాదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ ప్రాజెక్టుల పనుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాలుపంచుకోవాలని కేసీఆర్‌ కోరుకుంటున్నారు. ప్రతీ కార్యకర్త అపరభగీరథుడు కావాలన్నారు.  ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం కాకుండా, సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా అనుక్షణం కార్యకర్తలు, నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలవారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు మిషన్‌ భగీరథ పథకంపై దృష్టి సారించి విజయవంతం చేయాలన్నారు. ఇదంతా ఎందుకంటే కిందిస్థాయిలో ఏం జరుగుతుందో కార్యకర్తలకే తెలుసు కనుక కెసిఆర్‌ ఈ పిలుపునిచ్చారు.  ఇప్పుడు మిషన్‌ తెలంగాణ మొదలయ్యింది. ఈ సమయంలో కెసిఆర్‌కు అండగా ప్రతి కార్యకర్తా తనవంతుగా పనిచేయాలి. పదవుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలి. అలాచేస్తే పదవులు అవే వస్తాయి.  దేశంలో అనతికాలంలోనే అద్భుత విజయాలు సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలదొక్కు కుందని చెప్పుకుంటున్న దశలో ఎన్నికల ప్రణాళికను వంద శాతం అమలు చేస్తున్నామని సిఎం కెసిఆర్‌ ఖమ్మం వేదికాగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాజకీయాల్లో ఉన్నవారికి ఓపిక ఉండాలి. మన వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడాలి. అవకాశం వచ్చినపుడు అందిపుచ్చుకోవాలన్న సూయన మేరకు నడచుకోవాలి. అధినేత మనసెరిగి పనిచేస్తే తెలంగాణ కల సాకారం కాగలదు. రాష్ట్రంలో నామినేటెడ్‌ పదవుల భర్తీ పక్రియను ప్రారంభించామని, మే నెలాఖరులోగా అన్ని పదవులు భర్తీ చేస్తామన్నారు కనుక అంతవరకు వేచి చూడకుండా తమవంతుగా వాచ్‌డాగ్‌ పనులను మొదలు పెట్టాలి.  పార్టీ.. కన్నతల్లి, వృక్షం వంటిదని పోల్చి చెప్పారు. పార్టీ బాగా పనిచేస్తేనే ప్రభుత్వం కూడా ముందుకు కదులుతుంది. అందుకే ప్రభుత్వం స్థిరపడిందని, ఇక తాను పార్టీని పటిష్టం చేయడంపై దృష్టిపెడ్తానని కేసీఆర్‌ తెలిపారు.  విజయాలతో పొంగిపోవద్దు. అపజయాలతో కుంగిపోవద్దంటూ హెచ్చరిక కూడా చేశారు. ఎందుకంటే ఇటీవలి విజయాలు చూసి పొంగిపోయి ప్రజలను విస్మరిస్తే ఏనాటికైనా ప్రజలు కర్రుకాల్చి వాతపెడతారు. అధినేత కెసిఆర్‌కు ఇది బాగా తెలుసు. అందుకే తరచూ హెచ్చరిస్తుండడానికి కారణం ఇదే.  తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం ‘బంగారు తెలంగాణ’సాకారం కావాలంటే పార్టీ, ప్రభుత్వం జోడు గుర్రాల్లా కలసి పనిచేయాలని కూడా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సూచించారు. ప్రజా సమస్యల సంపూర్ణ పరిష్కారానికిది మార్గం చూపుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పలు పథకాల విజయవంతానికి కార్యకర్తలు, నాయకులు, మంత్రులు కృషిచేయాలని మార్గదర్శనం చేశారు. ధీరులు, విజ్ఞులు మాత్రమే అవమానాలను, అడ్డంకులను అధిగమిస్తూ అనుకున్న గమ్యాన్ని చేరుకుంటారని, నీచులు, మధ్యములు పని ప్రారంభించే ముందు దానివల్ల తలెత్తే పర్యవసనాలకు భయపడుతుంటారని తెలిపారు. తెలంగాణ ప్రజలు ధీరులని, ఉద్యమాన్ని విడిచిపెట్టలేదని, రాష్ట్రం సాధించే వరకు పోరాటం చేశారని కొనియాడారు. తెలంగాణ కోసం పోరాడిన ప్రతీ ఒక్కరి పేరూ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో చిరకాలం ఉంటుందన్నారు. తెరాసకు ఉన్న అవగాహన వేరెవ్వరికీ ఉండదన్న ఉద్దేశంతోనే…రాష్ట్ర సాధన తర్వాత పాలనను కూడా తెరాసకే తెలంగాణ సమాజం అప్పగించిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎదురైన బాలారిష్టాలను అధిగమించామని, ప్రపంచ యవనికపై తెలంగాణ హిమాలయాలంత ఎత్తుకు ఎదిగిందని చెప్పారు. ఇవన్నీ కూడా అనుభవంతో చెప్పిన కెసిఆర్‌ పార్టీ ఎలా పనిచేయాలో, అందులో కార్యకర్తలు ఎలా భాగస్వామి కావాలో దిశానిర్దేశం చేశారు. ఇక దీనిని ఆచరించి చూపడమే ఇప్పుడు కార్యకర్తల లక్ష్యం కావాలి. అదే తెలంగాణకు వరంగా మారుతుందనడంలో సందేహం లేదు.