ప్రజా సమస్యలను వదిలి విమర్శలా: తాహిర్‌

నిజామాబాద్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు తాహిర్‌ బిన్‌ హూదాన్‌ అన్నారు. రైతులు నీటి కోసం ఆందోళనలు చే/-తుంటే అణచివేసేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. ముందుగా వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను తీర్చకుండా, కేవలం ప్రచారాలకు మాత్రమే ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన, రైతులకు సరైన గిట్టుబాటు ధరలు కల్పించడంలో జాప్యం చేస్తోందన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పోరాడుతామని అన్నారు. కాంగ్రెస్‌ను ఆడిపోసుకునే ముందు ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్‌ రైతు వ్యతిరేకి ఆరోపించారు. మద్దతు ధర అడిగిన రైతులకు బేడీలు వేయించిన ఘనత ఆయనదన్నారు. పంట రుణాలను విడతల వారీగా మాఫీ చేసి వడ్డీ ఎగ్గొట్టారన్నారు. రైతుల ఆత్మ హత్యల్లోనూ తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందన్నారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ.. ఆ మాటే మరిచిపోయారన్నారు.