ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్‌ ఎన్నికలు

పాలమూరులో రెండు సీట్లపై కన్నేసిన కాంగ్రెస్‌
1న రాహుల్‌ రాక కోసం భారీగా ఏర్పాట్లు
కెసిఆర్‌వి రైతు వ్యతిరేక విధానాలన్న వంశీచంద్‌ రెడ్డి
మహబూబ్‌నగర్‌,మార్చి28(జ‌నంసాక్షి):  పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణలో రెండు పర్యాయాలు పర్యటించబోతున్నారని వంశీచంద్‌రెడ్డి తెలిపారు. మొదటిసారి ఏప్రిల్‌ 1న పర్యటనలో వనపర్తికి వస్తున్నారని చెప్పారు. మహబూబ్‌నగర్‌ పార్లమెంటు స్థానానికి రెండో దఫా పర్యటనలో వస్తారని చెప్పారు.హస్తం ఖాతాలో ఉన్న నాగర్‌కర్నూలు పార్లమెంటు నియోజకవర్గాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం పట్టుదలతో ఉంది. ఇందులో  భాగంగా ఇక్కడి నుంచి గతంలో రెండుసార్లు ఎంపీగా గెలిచిన సీనియర్‌ నేత మల్లు రవికి తిరిగి టికెటును కేటాయించారు. మాజీ ¬ంమంత్రి డీకే సమరసింహారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌లపై గెలుపు బాధ్యతలను అధిస్ఠానం ఉంచింది. ఏప్రిల్‌ 1న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వనపర్తికి వచ్చి మల్లురవికి మద్దతుగా ప్రచార సభలో పాల్గొననున్నారు. మరోవైపు.. తెరాస చేతిలో ఉన్న మహబూబ్‌నగర్‌ స్థానాన్ని సైతం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం చూస్తోంది. ఇక్కడి నుంచి ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి పోటీలో ఉన్నారు. ఈయన గెలుపు బాధ్యతలను సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డిలకు అధిష్ఠానం అప్పగించింది. సీనియర్‌ నేతలు ఒబేదుల్లా కొత్వాల్‌, మల్లు రవి సైతం ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి భాజపాలో చేరిన మాజీ మంత్రి డీకే అరుణ ఇక్కడ ప్రత్యర్థిగా ఉండటంతో ఈ స్థానంపై అధిష్ఠానం ప్రత్యేకంగా దృష్టి సారించింది.ఇదిలావుంటే
నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో ఎంపీ కవితకు వ్యతిరేకంగా, ముఖ్యంగా తెరాస ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతులు పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు చేశారని మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి పేర్కొన్నారు. రైతు సమస్యలు ఏ విధంగా ఉన్నాయో  వీరిని చూస్తే అర్థం అవుతుందన్నారు. అలాగే మంచిర్యాల జిల్లాలకు చెందిన ఓ రైతు ఆవేదన చూస్తే క్షేత్రస్థాయిలో సమస్యలను అర్థం చేసుకోవచ్చన్నారు. పట్టాదారు పాస్‌ పుస్తకాలల్లో అవకతవకలు ఈ ఘటన అద్దం పట్టిందని అన్నారు. అధికార తెరాస పట్ల తెలంగాణ ప్రజల వైఖరిలో మార్పు కనిపిస్తోందని, పట్టభద్రుల.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని  పార్టీ అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే రాబోతున్నాయని జోస్యం చెప్పారు. ప్రచారంలో భాగంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ మాత్రమే సామాన్యులకు అందుబాటులో ఉంటుందని అన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులే కాదు రైతులు కూడా తెరాస ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. గత అయిదేళ్లలో తెరాస సర్కారు ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటల గారడీతో, అమలుకు నోచుకోని హావిూలతో ప్రజలను మభ్యపెడుతూ వస్తున్నారని అన్నారు.  బ్యాలెట్‌ ద్వారా జరుపుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తోందని, ఈవీఎంల ద్వారా జరుపుతున్న ఎన్నికల్లో మాత్రం తెరాస గెలుపొందుతోందని అనుమానాలు వ్యక్తం చేశారు.