ప్రతిష్ట దిగజారుస్తున్న ఆప్‌ వ్యవహారాలు

రాజధాని పరువు పోతున్నా పట్టించుకోని కేంద్రం

ఆందోళనలతో దేశం పరువు బాజరున పడుతోంది

న్యూఢిల్లీ,జూన్‌19(జ‌నం సాక్షి): ఢిల్లీ వ్యవహారాలనుచిన్నవిగా చేసి చూడడం ద్వారా బిజెపి దేశ పరువును తీస్తోంది. సమస్యను చర్చలతో పరిష్కరించే ప్రయత్నం చేయకపోవడం ద్వారా రాజధాని పరువు గంగలో కలిసేలా చేశారు. ఈ మొత్తం వివాదంలో దోషమెవరిదన్న సంగతలా ఉంచి ఆ ధర్నా విషయంలో ఏదో ఒకటి చేసి పరిస్థితిని చక్కదిద్దాలన్న స్పృహ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయనకు తోచకపోతే కనీసం కేంద్రమైనా జోక్యం చేసుకుని ఉంటే బాగుండేది. ఢిల్లీకి దేశం నలుమూలలనుంచి నిత్యం ఎందరో వస్తుంటారు. విదేశీ నేతలు, వాణిజ్య ప్రతినిధులు పర్యటిస్తుంటారు. అలాంటిచోట ఈమాదిరి ఉదంతాలు చోటు చేసుకోవడం వల్ల మన ప్రజాస్వామ్య వ్యవస్థ నవ్వులపాలవడం మినహా మరే ప్రయోజనమూ కలగదు. తనను ముఖ్యమంత్రి బెదిరించారంటూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ విడుదల చేసిన ప్రకటన గమనిస్తే ఇది మరింత ముదిరేలా కన బడుతోంది. మూడేళ్లక్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ ఏదో ఒక వివాదానికి కేంద్ర బిందువుగా మారుతూనే ఉన్నారు. ప్రస్తుతం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ నివాసంలో ఆయన, ఆయన సహచర మంత్రులు మానిష్‌ సిసోడియా, సత్యేందర్‌ జైన్‌, గోపాల్‌ రాయ్‌లు ధర్నా చేస్తున్నారు. నాలుగు నెలలుగా ప్రభుత్వంలో పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారులు సాగిస్తున్న సమ్మెను విరమింపజేయాలన్నది వారి ప్రధాన డిమాండ్‌. ఆప్‌ నేతలకు మద్దతుగా ఆ పార్టీ కార్యకర్తలు బైజాల్‌ నివాసం వెలుపల ధర్నా చేస్తు న్నారు. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేజీవ్రాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) 70 స్థానాలకూ 67 గెల్చుకుంది. కానీ అది ఢిల్లీ కావడం, వేరే రాష్టాల్రతో పోలిస్తే అక్కడిప్రభుత్వానికి పరిమితమైన అధికారాలుండటం, దూకుడుగా ఉండే కేజీవ్రాల్‌ వంటి వ్యక్తి సీఎం స్థానంలో ఉండటం వల్ల సమస్యలు తప్పడం లేదు. వీటి పరిష్కారానికి కేజీవ్రాల్‌, ఆయన సహచరులు అనుసరిస్తున్న విధానాలు ఆ సమస్యల్ని మరింత జటిలం చేస్తున్నాయి. ప్రభుత్వం విడుదల చేయదల్చుకున్న ఒక వాణిజ్య ప్రకటన విషయంలో అధికారులు అడ్డు చెప్పడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్‌తో మొన్న ఫిబ్రవరిలో కేజీవ్రాల్‌, ఆయన సహ చరులు సమావేశమైనప్పుడు ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.ఆ సందర్భంలో తనపై ఇద్దరు ఆప్‌ ఎమ్మెల్యేలు దౌర్జన్యం చేశారని అన్షు ప్రకాష్‌ ఆరోపించగా, తనను ఆయన కులం పేరుతో దూషించారని ఆ ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు ప్రత్యారోపణ చేశారు. ఆ కేసుల దర్యాప్తు కొనసాగుతుండగా, తమకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఐఏఎస్‌లు కోరుతున్నారు. క్షమాపణ చెప్పలేదన్న కారణంతో వారు సమ్మె చేస్తున్నారన్నది కేజీవ్రాల్‌ తాజా ఫిర్యాదు. ఈ సమ్మె వెనక కేంద్రమూ, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఉన్నారని ఆయన ఆరోపణ. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక 2014లో అఖిల భారత సర్వీసులకు సంబంధించిన ప్రవర్తనా నియమావళిని సవరించారు. తాము సమ్మె చేయడం లేదని చెబుతూనే ముఖ్యమంత్రి, ఆయన సహచరులు నిర్వహించే ‘రొటీన్‌ సమావేశాలకు’ మాత్రం హాజరుకావడం లేదని ఐఏఎస్‌లు అంగీకరిస్తున్నారు. తమ ఫోన్లకూ, ఎస్సెమ్మెస్‌లకూ ఐఏఎస్‌లు జవాబివ్వడంలేదని మంత్రులు చెబుతుంటే… తాము వారి నుంచి వచ్చే లిఖితపూర్వక ఆదేశాలకు మాత్రమే జవాబిస్తున్నామని అధికారులంటున్నారు. కేజ్రీవాల్‌ చెబుతున్నట్టు అధికారులు సమ్మెలో లేకపోవచ్చుగానీ సహాయ నిరాకరణ చేస్తున్నారని దీన్ని బట్టే అర్ధమవుతుంది. సకల అధికారాలూ గల ప్రభుత్వాలున్నచోట లేదా కేంద్రంలోని పాలక పక్షమే రాష్ట్రంలో కూడా అధికారం చలాయిస్తున్నచోట ముఖ్యమంత్రితో, మంత్రులతో అధికారులు ఇలా వ్యవహరించగలరా? అటు పాలకపక్ష ఎమ్మెల్యేలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై దౌర్జన్యానికి దిగడమైనా, ఇటు ఐఏఎస్‌లు సహాయ నిరాకరణ కొనసాగిస్తుండటమైనా ఊహకందనిది. ఈ వివాదం నాలుగు నెలలుగా కొనసాగడం అంతకన్నా విడ్డూరమైనది.కేజీవ్రాల్‌కు ముందు పనిచేసిన షీలా దీక్షిత్‌ కూడా సమస్యలు ఎదుర్కొన్నారు. తమ పార్టీ ప్రభుత్వమే కేంద్రంలో ఉన్నా ఆమెకు ఇవి తప్పలేదు. కాకపోతే ఆమె లౌక్యంతో వ్యవహరించి వాటి నుంచి బయటపడ్డారు. కేజీవ్రాల్‌కు అలాంటి నైపుణ్యం లేదు. ఏతావాతా ఢిల్లీలో ఇప్పుడు తలెత్తిన ఘర్షణ వాతావరణం పర్యవసానంగా పాలన కుంటుబడింది. విద్యుత్‌, మంచినీరు సక్రమంగా అందడం లేదని, పారిశుద్ధ్యం దెబ్బతిన్నదని ఫిర్యాదులు ముమ్మరమయ్యాయి. ఢిల్లీ విస్తృతి రీత్యా దానికొక రాష్ట్ర ప్రభుత్వం అవసరమని గుర్తించి, అధికారాలు మాత్రం పరిమితంగా ఇచ్చినప్పుడు పరిస్థితి ఇంతకన్నా మెరుగ్గా ఉండదు.