ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు 

– ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో మంచి ఫలితాలు
– ప్రజల సహకారంతో నేరాలను అదుపులోకి తేవచ్చు
– డీజీపీ మహేందర్‌రెడ్డి
– తన స్వగ్రామం కిష్టాపురంలో పర్యటించిన డీజీపీ
ఖమ్మం, ఆగస్టు18(జ‌నం సాక్షి) : హైదరాబాద్‌ తరహాలో ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలంగాణ డిజిపి ముదిరెడ్డి మహేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన తన స్వగ్రామమైన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ఏర్పాటు చేసే సిసి కెమెరాలను హైదరాబాద్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెల్‌తో అనుసంధానం చేస్తామని ఆయన వెల్లడించారు. ఏడాది చివరినాటికి హైదరాబాద్‌ కమాండ్‌ కంట్రోల్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. పోలీసు శాఖలో అవినీతి నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో మంచి ఫలితాలు వస్తున్నాయని ఆయన చెప్పారు. పోలీసులకు ప్రజలు సహకరించినప్పుడే నేరాలను అదుపులోకి తేవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.24 గంటల పాటు సేవలందిస్తున్న పోలీసుల సంక్షేమానికి చర్యలు చేపట్టామని డీజీపీ ఉద్ఘాటించారు. పోలీస్‌ శాఖ బలోపేతానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ఇప్పటికే శాఖలోని పలు విభాగాల్లో ఖాళీలను భర్తీచేయడం జరిగిందని మరిన్ని పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయడం జరిగిందన్నారు. తెలంగాణ పోలీస్‌శాఖకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని, అదే గుర్తింపును కొనసాగించేలా పోలీస్‌శాఖ లోని ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నట్లు డీజీపీ తెలిపారు. ప్రజలు పోలీసుశాఖకు సహకరించాలని డీజీపీ కోరారు. దీని ద్వారా నేరాలను పూర్తిస్థాయిలో అదుపులోకి తేవచ్చని పేర్కొన్నారు.