ప్రతి విద్యార్థికి పౌష్టికాహారంప్రతి విద్యార్థికి పౌష్టికాహారం

ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.1.25లక్షలు ఖర్చు చేస్తున్నాం
గురుకుల విద్యార్థుల కోసం బడ్జెట్‌లో రూ.4వేల కోట్లు కేటాయించాం
మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
కామారెడ్డిలో గిరిజన బాలుర హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి
కామారెడ్డి, జూన్‌14(జ‌నం సాక్షి) : విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ప్రతి ఒక్క విద్యార్థికి పౌష్టికాహారం అందించటం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని గిరిజన బాలుర హాస్టల్‌ను శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం హాస్టల్‌కు వెళ్లిన మంత్రి నూనె, పప్పులు, బియ్యం, వంటకు ఉపయోగించే పదార్థాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వండిన ఆహారంను రుచి చూశారు. విద్యార్థులతో మంత్రి ముచ్చటించారు. వసతులు, ఆహారం ఎలా పెడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారమే చికెన్‌, గుడ్డు పెడుతున్నారా అంటూ విద్యార్థులను అడిగారు. తమకు అన్ని సక్రమంగానే అందుతున్నాయని విద్యార్థులు తెలపడంతో మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. హాస్టల్స్‌ లో ఉండే విద్యార్థులకు ఆహారం, వసతి సౌకర్యాల విషయంలో ఎలాంటి లోటు రానివ్వకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్యం ముఖ్యమని, అందుకే ప్రభుత్వం ఖర్చుకు వెనకాడకుండా చక్కటి పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.1,25000 ఖర్చు చేస్తున్నాం. గురుకుల విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.4000 కోట్లు కేటాయించిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఐదువందలకుపైగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. బాలికా విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. త్వరలో 7వ తరగతి నుంచి 12వ తరగతి చదివే విద్యార్థుల వరకు హెల్త్‌ కిట్‌లను అందివ్వటం జరుగుతుందని తెలిపారు. ఈ కిట్‌ లో విద్యార్థినీలకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు ఉంచటం జరుగుతుందని పోచారం తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారన్నారు. అన్ని రంగాల్లోని ప్రజలకు నాణ్యమైన  ప్రభుత్వ సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. గత 60ఏళ్లలో పూర్తి కాని పనులు కూడా తెలంగాణ వచ్చిన తరువాత కేసీఆర్‌ ఆధ్వర్యంలో నాలుగేళ్లలో పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మనలను నమ్మి పిల్లలను తల్లిదండ్రులను మన వద్దకు పంపారు. వారిని బిడ్డల్లా చూసుకోవాలని మంత్రి వార్డెన్‌కు సూచించారు.