ప్రతీఒక్కరూ సమాజసేవలో..  భాగస్వాములు కావాలి


– రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌
నెల్లూరు, ఫిబ్రవరి22(ఆర్‌ఎన్‌ఎ) : మనం జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి వెళ్లి.. సమాజ సేవలో భాగస్వాములు కావాలని అప్పుడు మన జన్మకు సార్థకత ఉంటుందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. స్వర్ణభారతి ట్రస్ట్‌ 18వ వార్షికోత్సవ వేడుకలో శుక్రవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.  అక్షర స్కూల్‌ ఇంగ్లీష్‌ విూడియం అయినా.. తెలుగు సంస్కృతి నేర్పుతున్నారని రామ్‌నాథ్‌ కోవింద్‌ కొనియాడారు. స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ప్రశంసించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తనకు అత్యంత ఆప్తులని తెలిపారు. మనం జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి వెళ్లినా.. సమాజానికి ఏదో ఒక సేవ చేయాలన్నారు. వెంకయ్య నాయుడు జీవితంలో ఎంతో సాధించాడని, ఆయన అందరికీ అజాతశత్రువన్నారు. వెంకయ్య నాయుడు తెలుగు సంస్కృతిని కాపాడేందుకు చేస్తున్న సేవలు అభినందనీయని, మరిన్నిసేవా కార్యక్రమాలు చేపట్టి స్వర్ణభారత్‌ ప్రజలకు చేరువ కావాలని కోరుకున్నారు.
ఢిల్లీలో ఉన్నప్పటికి గ్రావిూణ సంస్కృతి సంప్రదాయానికి విలువిస్తూ.. పాటిస్తూ ఉండే వ్యక్తి వెంకయ్య నాయుడని రాష్ట్రపతి కోవింద్‌ కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేసేందుకే స్వర్ణ భారత్‌ ట్రస్ట్‌ ప్రారంభించామన్నారు. ట్రస్ట్‌ ద్వారా ఆంధ్ర, తెలంగాణలోనే కాక ఇతర ప్రాంతాల్లో సేవ చేస్తున్నామని తెలిపారు. ఇన్నేళ్లలో గ్రావిూణ ప్రాంతాల్లో యువత, మహిళలకు స్వయం శక్తితో ఎదిగేలా శిక్షణనిచ్చామన్నారు. రైతులకు అండగా నిలిచేందుకు అనేక సేవా కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. తన పిల్లలు రాజకీయాల్లోకి వచ్చినా సంతోషమేనని… అక్కడ చేసే సేవనే స్వర్ణభారత్‌ ద్వారా ఇక్కడా చేస్తున్నారని అన్నారు.