ప్రతీ గ్రామానికి బీటీ రోడ్‌

– రోడ్ల విస్తరణకు ప్రభుత్వం కోట్లు వ్యచ్చిస్తుంది
– రంగారెడ్డి జిల్లాలో బీటీ రోడ్లకు రూ.566 కోట్లు కేటాయించాం
– రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
– మక్తమాదారం – షాదర్‌నగర్‌ మధ్య బీటీరోడ్డుకు శంకుస్థాపన చేసిన మంత్రి
షాద్‌నగర్‌, మే5(జ‌నం సాక్షి ) : రాష్ట్రంలోని ప్రతీ గ్రామానికి బీటీ రోడ్డు, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం,
రాజధానికి డబుల్‌ రోడ్లు వేస్తున్నామని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం రూ. 48 కోట్లతో మక్తమాదారం – షాద్‌నగర్‌ మధ్యలో బీటీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రోడ్ల విస్తరణకు ప్రభుత్వం కోట్లాది నిధులు అందిస్తున్నదని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో బీటీ రోడ్లకు రూ. 566 కోట్లు కేటాయించి 344 కిలోవిూటర్ల మేర రోడ్లు వేస్తున్నామని చెప్పారు. షాద్‌నగర్‌ నియోజకవర్గంలో రూ. 102 కోట్లతో అన్ని రోడ్లను బీటీ రోడ్లుగా మార్చామని గుర్తు చేశారు.  రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల విస్తరణకు పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా రైతాంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. దీనిలో బాగంగా రైతు సమన్వయ సమితుల ద్వారా రైతులకు అండగా నిలవనున్నారని, దీనికితోడు ఐదువేల ఎకరాలకు ఒక ఏవోను నియమించటం జరిగిందన్నారు. దీనికితోడు పంటల సాగు సమయంలో రైతులు వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల చుట్టూ తిరగకుండా ఉండేందుకు ప్రభుత్వమే స్వయంగా ఎకరానికి రూ.4వేల చొప్పున పెట్టుబడి సహాయాన్ని అందిస్తుందని, మే 10 నుంచి ఈ చెక్కులను పంపిణీ చేయటం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రజలంతా ఈ చెక్కుల పంపిణీలో పాల్గొని ఓ పండుగలా నిర్వహించుకోవాలని మంత్రి సూచించారు.