ప్రధాని మోడీకి కొరియా శాంతి పురస్కారం

తొలిసారి అందుకున్న భారతీయుడిగా మోడీ
భారత ప్రజలకు దక్కిన గౌరవమని ప్రకటన
నమామి గంగే ప్రాజెక్ట్‌కు మొత్తం అందచేత
న్యూఢిల్లీ,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి):  దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపర్చడం, ఆర్ధిక అభివృద్ధి కోసం చేస్తున్న కృషికిగానూ దక్షిణ కొరియా ఆయనను సియోల్‌ శాంతి పురస్కారంతో సత్కరించింది. గతేడాది అక్టోబర్‌లోనే సియోల్‌ పీస్‌ ప్రైజ్‌ కల్చరల్‌ ఫౌండేషన్‌ ఆయనకు ఈ పురస్కారం ప్రకటించింది. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ప్రధానికి శుక్రవారం జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ… ఈ అవార్డు వ్యక్తిగతంగా నా ఒక్కడికి మాత్రమే కాదు… మొత్తం భారత ప్రజలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. గత ఐదేళ్లలో భారత్‌ సాధించిన విజయానికి గుర్తు ఇది. 130 కోట్ల భారత ప్రజల నైపుణ్యానికి ప్రతీక ఇది…అని వ్యాఖ్యానించారు.
అయితే ఆ అవార్డు ప్రైజ్‌మనీ కింద వచ్చే సుమారు కోటిన్నర(2 లక్షల డాలర్లు) రూపాయాలను ఆయన నమామి గంగే నిధికి సమర్పిస్తున్నట్లు తెలిపారు. సియోల్‌ శాంతి బహుమతిని మోదీ దేశానికి అంకితం చేశారు. జర్మనీ ఛాన్సలర్‌ ఏంజిలా మెర్కల్‌, ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్‌ కీ మూన్‌, యూఎన్‌ మాజీ చీఫ్‌ కోఫీ అన్నన్‌, బంగ్లాదేశ్‌ వ్యాపారవేత్త మహ్మద్‌ యూనుస్‌లు ఈ అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు. ఉగ్రవాద సంస్థలను సంపూర్ణంగా నిర్మూలించాల్సిన సమయం ఆసన్నమైందని మోదీ అన్నారు. అవార్డు అందుకున్న తర్వాత మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 1998 ఒలింపిక్స్‌లో పాడిన థీమ్‌ సాంగ్‌ను ఆయన గుర్తు చేశారు. హ్యాండ్‌ ఇన్‌ హ్యాండ్‌, వీ స్టాండ్‌, ఆల్‌ ఎక్రాస్‌ ద ల్యాండ్‌ అన్న పాటను మోదీ వినిపించారు. కలిసికట్టుగానే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలన్నారు. మహాత్మాగాంధీ 150వ జయంతి సంవత్సరాన తనకు ఈ అవార్డు రావడం గౌరవంగా భావిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. 1988లో సియోల్‌ ఒలింపిక్స్‌కు కొద్ది వారాల ముందు అల్‌-ఖైదా పేరుతో ఓ ఉగ్రవాద సంస్థ ప్రారంభమైందనీ.. ఇవాళ ప్రపంచం మొత్తానికి ఉగ్రవాద ముప్పు వ్యాపించిందని గుర్తుచేశారు. ప్రపంచ శాంతి, భద్రతలకు ఉగ్రవాదం పెను ప్రమాదంగా పరిణమించిందన్నారు. కాగా సియోల్‌ శాంతి పురస్కారం అందుకున్న తొలి భారతీయుడు మోదీయే కావడం విశేషం.
ఉగ్రవాద నిర్మూలనకు ఉమ్మడి నిర్ణయం
40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌, దక్షిణ కొరియా దేశాలు కీలక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఉగ్రవాదానికి చెక్‌ పెట్టేందుకు ఇరుదేశాలు పరస్పరం సహకరించుకునేలా ఎంవోయూ కుదుర్చుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జేయిన్‌ సమక్షంలో జరిగిన ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఇరుదేశాల మధ్య ఈ మేరకు సంతకాలు జరిగాయి. ఇరుదేశాల సంయుక్త ప్రకటన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ…
పుల్వామా దాడికి సంతాపం తెలపడంతో పాటు తీవ్రవాదానికి వ్యతిరేకంగా మాకు మద్దతిచ్చినందుకు అధ్యక్షుడు మూన్‌కి కృతజ్ఞతలు. ఇరుదేశాల మధ్య ఇవాళ కుదిరిన ఒప్పందం మున్ముందు తీవ్రవాద వ్యతిరేక కార్యాచరణకు ఉపయోగపడుతుంది…’ అని పేర్కొన్నారు. ప్రత్యేకించి రక్షణ రంగంలో దక్షిణ కొరియాతో తమ సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు ప్రధాని పేర్కొన్నారు. భారత సైన్యంలోకి కే-9 వజ్ర ఆయుధాలు ప్రవేశపెట్టడమే దీనికి నిదర్శనమన్నారు. దక్షిణ కొరియాలో తయారైన 10 అత్యాధునిక కే-9 ఫిరంగులు గతేడాది భారత ఆర్మీ అమ్ములపొదిలో చేరిన సంగతి
తెలిసిందే. 2020 నవంబర్‌ నాటికి మరో 100 ఫిరంగులను భారత సైన్యంలో ప్రవేశపెట్టనున్నారు.
కొరియా అమరులకు మోడీ నివాళి
దక్షిణ కొరియాలో రెండో రోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  సియోల్‌లోని నేషనల్‌ సెమెట్రీని సందర్శించారు. అమరులైన కొరియా సైనికులకు ఘనంగా నివాళి అర్పించారు. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ ట్విటర్లో స్పందిస్తూ.. వీరులకు వందనం. రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియాలోని జాతీయ శ్మశాన వాటికలో 165000 మంది అమరవీరులకు ప్రధాని మోదీ ఘనంగా నివాళులర్పించారు.. అని పేర్కొన్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కొరియా అధ్యక్షుడి కార్యాలయం బ్లూ హౌస్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. గతేడాది జూలైలో భారత పర్యటనకు వచ్చివెళ్లిన దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జేయిన్‌తో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. రెండ్రోజుల పర్యటన కోసం ప్రధాని గురువారం దక్షిణ కొరియా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు… ద్వైపాక్షిక వాణిజ్యం, సాంస్కృతిక సంబంధాలను మెరుగు పర్చడమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగుతోంది.