ప్రధాని మోడీ.. జోక్యం చేసుకోండి

 లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కనుసన్నల్లో అధికారులు పనిచేస్తున్నారు
ఐఏఎస్‌ అధికారులు విధుల్లోకి వచ్చేలా చూడండి
చేతులు జోడించి వేడుకుంటున్నాం
మోడీకి లేఖ రాసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌
నాల్గోరోజు సాగిన కేజ్రీవాల్‌ దీక్ష
న్యూఢిల్లీ, జూన్‌14(జ‌నం సాక్షి) : గత మూడు నెలలుగా ఐఏఎస్‌ అధికారులు విధుల్లోకి హాజరుకాకపోవడం వల్ల వాతావరణ కాలుష్య నియంత్రణకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నామని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ కార్యాలయంలో సీఎం కేజీవ్రాల్‌ తన మంత్రులతో కలిసి చేస్తున్న ధర్నా నాలుగో రోజుకు చేరింది. దీనిపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కేజ్రీల్‌ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. గత మూడు నెలలుగా ఢిల్లీలో ఐఏఎస్‌ అధికారులు సమ్మెలో ఉన్నారు. మంత్రుల సమావేశానికి వాళ్లెవరూ హాజరు కావడం లేదు. దీని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, లెఫ్టినెంట్‌ గవర్నర్‌, కేంద్రం కనుసన్నల్లోనే ఢిల్లీ ఐఏఎస్‌ అధికారులు పనిచేస్తున్నారని అన్నారు. అందుకే ఐఏఎస్‌ అధికారుల సమ్మెను రద్దు చేయడంపై ఢిల్లీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతోందని కేజ్రీవాల్‌ తెలిపారు.  ఢిల్లీలో వాయుకాలుష్యం అతిపెద్ద సమస్యగా మారిందని, పదిహేను రోజులకు ఒకసారి కాలుష్య తీవ్రత విషయంపై అధికారులు సవిూక్ష సమావేశం నిర్వహించాల్సి ఉందన్నారు. కానీ, ఐఏఎస్‌ అధికారులు గత మూడు నెలలుగా సమ్మెలో ఉండటం సమావేశం జరగడం లేదని, దీంతో ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరిందని తెలిపారు. దీనిపై చర్యలు తీసుకునేందుకు సహకరించాలని,  కేవలం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మాత్రమే ఐఏఎస్‌ అధికారుల సమ్మెను నిలిపివేయగలరని కానీ ఆయన మాకు సహాయం చెయ్యడం లేదని కేజ్రీవాల్‌ అభిప్రాయపడ్డారు.  ఈ సమస్యకు విూరైనా పరిష్కారం చూపుతారని ఢిల్లీ ప్రజలు ఎంతో నమ్మకంగా ఎదురుచూస్తున్నారని  చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నామని వాళ్లు సమ్మెను విరమించేలా చేసి.. మళ్లీ విధులకు హాజరయ్యేలా చూడండి’ అని కేజీవ్రాల్‌ లేఖలో పేర్కొన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాల్సిందిగా కోరుతూ గత మూడు రోజులుగా కేజీవ్రాల్‌, మనీశ్‌ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయంలో ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. వీరికి మద్దతు తెలుపుతూ ‘ఆప్‌ కార్యకర్తలు నిన్న ఢిల్లీని విడిచి వెళ్లండి’ అంటూ పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి భాజపా మాజీ
సీనియర్‌ నేత యశ్వంత్‌ సిన్హా పాల్గొని మద్దతు తెలిపారు. మరోవైపు డిమాండ్ల పరిష్కారం కోరుతూ సత్యేంద్ర జైన్‌ చేపట్టిన ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరగా.. మనీశ్‌ సిసోడియా దీక్ష రెండో రోజుకి చేరింది. గురువారం సాయంత్రం రాజ్‌పథ్‌ మార్గంలో సీఎంకు మద్దతుగా ఆప్‌ కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.