ప్రధాన సమస్యలపై కొరవడిన దృష్టి

ఆదాయం తగ్గడంతో అరకొర పనులు 
మంచిర్యాల,మే17(జ‌నం సాక్షి): అధికారులు, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ లేక ఎక్కడి అభివృద్ధి పనులు అక్కడే ఆగిపోయాయి. పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయం రాకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి.మంచిర్యాల పురపాలక సంఘంలో ఇపుడు కీలక పోస్టులు ఖాళీగా ఉండంతో పరిపాలన విభాగం స్తంభించి పోయింది. మంచిర్యాల జిల్లా కేంద్రం అయ్యాక పనిభారం పెరిగిన వేళ ప్రధాన అధికారుల పోస్టులను భర్తీ చేయడంలో జాప్యం చేయడంతో పాలన అస్థవ్యస్థంగా మారింది.మంచిర్యాల పురపాలక సంఘంలో ఏడాదికి 300 నుంచి 450 ఇళ్లు మున్సిపల్‌ అనుమతి లేకుండా నిర్మిస్తున్నారు. దీనితో మంచిర్యాల పురపాలక సంఘం భారీ ఆదాయం కొల్పోతుంది. పూర్తిస్థాయిలో అధికారులుల ఉంటే తప్ప పాలన గాడిన పడేలా లేదని ప్రజలు అంటున్నారు.   పనులు చేసిన గుత్తేదారులకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, స్థిరాస్తికి సంబంధించిన మ్యుటేషన్లు అన్నీ ఆగిపోయాయి. కేవలం మున్సిపల్‌ ఉద్యోగుల వేతనాలు, స్టేషనరీ ఖర్చులకు సంబధించిన అత్యవసర బిల్లులు మాత్రమే చెల్లించి ఇన్‌ఛార్జీ అధికారులు చేతుల దులుపుకొంటున్నారు.  మంచిర్యాల పురపాలక సంఘంలో ప్రధాన పోస్టులు ఖాళీగా ఉండటంతో పరిపాలన గతి తప్పుతోంది. పురపాలక సంఘంలో ఖాళీగా ఉన్న కీలక పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పురపాలక సంఘం అధ్యక్షురాలు మామిడిశెట్టి వసుంధర అన్నారు. ఇన్‌ఛార్జీ అధికారులతో పట్టణ అభివృద్ధికి అటంకం ఏర్పడినా ఎక్కడా లోపం లేకుండా చూస్తున్నామని అన్నారు. భూవివాదాలకు కేంద్రంగా మంచిర్యాల జిల్లాలో సమస్యలతో తీరికలేకుండా ఉంటుంది.  సకాలంలో ఇంటి పన్నులు, నల్లా బిల్లులు సక్రమంగా వసూలు కాలేదు. వసూలైన పన్నులు కార్మికుల వేతనాలు, కరంటు బిల్లులు, స్టేషనరీ ఖర్చులకే సరిపోతున్నాయి. గుత్తేదారులు చేసిన అభివృద్ది పనులకు బిల్లులు చెల్లింరకపోవడంతో రెండు నెలలుగా మిగతా అభివృద్ధి పనులను గుత్తేదారులు నిలిపివేశారు. పారిశుద్ధ్య అధికారి పర్యవేక్షణ లేక ఏ వీధిలో చూసినా చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి.  విధినిర్వహణపై పర్యవేక్షణ లేక పట్టణంలోని వీధులన్నీ అపరిశుభ్రంగా మరాయి.  సహాయక ఇంజనీర్లకు అవగాహన లేక కొత్తగా పనులను చేయకుండా ప్రస్తుతం ఉన్న మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ పనులు మాత్రమే పర్యవేక్షిస్తున్నారు. దీనితో మంచిర్యాల పట్టణ అభివృద్ధి అంతా ఆగిపోయింది. జిల్లా కేంద్రంలో అక్రమ ఇళ్ల నిర్మాణం, అక్రమ లేఔట్లు రోజురోజుకు పెరిగిపోతున్నా నియంత్రించే వారు లేకుండా పోయింది.