ప్రపంచంలో ఆరో అతిపెద్ద.. 

ఆర్థిక వ్యవస్థగా భారత్‌
– తొలి ఐదు స్థానాల్లో అమెరికా, చైనా, జపాన్‌, జర్మనీ, బ్రిటన్‌లు
– ప్రపంచ బ్యాంక్‌ వెల్లడి
పారిస్‌, జులై11(జ‌నం సాక్షి) :  ప్రపంచంలోకెల్లా ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలిచిందని ప్రపంచ బ్యాంక్‌ వెల్లడించింది. 2017 సంవత్సరంలో భారత జీడీపీ 2.597ట్రిలియన్‌ డాలర్లకు చేరడంతో భారత్‌ ఈ ఘనత సాధించింది. దీంతో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశాల జాబితాలో ఫ్రాన్స్‌ను వెనక్కి నెట్టి మరీ భారత్‌ ఆరో స్థానం దక్కించుకుంది. గతేడాది ఫ్రాన్స్‌ జీడీపీ 2.582 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇక ఈ జాబితాలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. చైనా, జపాన్‌, జర్మనీ, బ్రిటన్‌ తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి.
అయితే తలసరి జీడీపీ విషయంలో మాత్రం ఫ్రాన్స్‌తో పోలిస్తే భారత్‌ వెనుకబడే ఉందని తెలిపింది. ప్రస్తుతం భారత జనాభా 130కోట్లను దాటింది. మరోవైపు ఫ్రాన్స్‌ జనాభా మాత్రం 6.7కోట్లు మాత్రమే. అంటే ఫ్రాన్స్‌ తలసరి జీడీపీ భారత తలసరి జీడీపీ కంటే 20 రెట్లు ఎక్కువగానే ఉందని ప్రపంచబ్యాంక్‌ ఈ సందర్భంగా వెల్లడించింది. 2016 నవంబరులో పెద్ద నోట్లు రద్దు చేయడంతో భారత ఆర్థిక పురోగతి నెమ్మదించింది. అయితే 2017 జులై తర్వాత ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చిందని, నాటి నుంచి భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుందని ప్రపంచ బ్యాంక్‌ పేర్కొంది. తయారీ రంగం, వినియోగదారుల ఖర్చులే ఇందుకు ప్రధాన కారణాలని తెలిపింది. మరో దశాబ్ద కాలంలో భారత జీడీపీ రెట్టింపయ్యే అవకాశాలున్నాయని ప్రపంచబ్యాంక్‌ అభిప్రాయపడింది. 2032 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా ఎదుగుతుందని అంచనా వేసింది.