ప్రభుత్వాసుపత్రుల్లో లక్ష్యానికి గండి

జిల్లాల్లో అమలు కాని నిర్ణయాలు
హైదరాబాద్‌,మార్చి5(జ‌నంసాక్షి):కార్పొరేట్‌ వైద్యం కొనలేక రోగంతో సతమతమవుతూ ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు పూర్తిస్థాయిలో మందులు అందడం లేదు. ఏరియా ఆసుపత్రుల్లో చేరినవారికి సర్కారు నుంచి మందులు సరఫరా కాలేదంటూ బయటకు వెళ్లి తెచ్చుకోమని రాయడం పరిపాటిగా మారింది. ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుని ఆస్పత్రులను బలోపేతం చే/-తోంది.  వైద్యుడు రాసిన పూర్తి మందులు ఇవ్వాలని సిబ్బందిని అడిగితే మందులు లేవు, బయటే తెచ్చుకోవాలంటూ బాధితులకు చెప్పడం నిత్యకృత్యంగా మారింది. ఆసుపత్రికి వచ్చే రోగులకు మందులు ప్రైవేట్‌గా కొనుగోలు చేసుకోవాలంటూ చీటీలు రాసిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు సిబ్బింది మాన్యువల్‌ విధానాన్ని ఆసరాగా తీసుకొని సర్కారు మందులను పక్కదారి పట్టిస్తున్నారని రోగులు వాపోతున్నారు. ఔషధాలు ఇచ్చినట్లు పుస్తకాల్లో రాసిపెడుతూ ప్రైవేట్‌ దుకాణాలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.  ప్రభుత్వాసుపత్రిలో ఇచ్చే మందులు గ్రామాల్లో పలువురు ఆర్‌యంపీ, పీయంపీల వద్ద దర్శనమివ్వడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. యథేచ్ఛగా గ్రావిూణ ప్రాంతాల్లోని మెడికల్‌ దుకాణాల్లో కనిపిస్తున్నాయి. ఫార్మసిస్టుల చేతివాటంతో రోగులు అప్పులు చేసి మందులను ప్రైవేట్‌ మెడికల్‌ దుకాణాలకు వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి జిల్లాలో దాపురించింది.  ప్రధాన ఆసుపత్రితో పాటు జిల్లా ఆసుపత్రుల్లో సైతం ఇదే దుస్థితి నెలకొంది. జిల్లాల్లో ఏటా కోట్లకు పైగా మందుల కోసం సర్కారు కేటాయిస్తున్నా చికిత్స అందని ద్రాక్షగానే మిగిలింది. కొన్నిసార్లు దవాఖానాలకు మందులు సరఫరా చేస్తున్నా ఉద్యోగులు పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వం వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేలా సాంకేతిక పరిజ్ఞానంతో ఈ-ఔషధి విధానానికి గత జనవరిలో శ్రీకారం చుట్టింది. ప్రధాన ఆసుపత్రితో పాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇది అమలు కావాల్సి ఉన్నా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రతి మందులకు పక్కా లెక్క చూపాలి. ఎంత మంది రోగులకు ఎలాంటి మాత్రలను వైద్యులు అందించారనే వివరాలు సులువుగా తెలుసుకునేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ-ఔషధి విధానాన్ని అమలులోకి
తెచ్చింది. వైద్యులు కూడా ఎక్కడి నుంచైనా రోగికి సత్వరమే వైద్య సేవలు అందిచేందుకు అవకాశం ఉంటుంది. ఒక్కసారి రోగి ఈ-ఔషధి విధానంలో పేరు నమోదు చేసుకుంటే తనకు అందుబాటులో ఉన్న ఏ ప్రభుత్వాసుపత్రి నుంచైనా సంబంధిత మందులు తీసుకోవచ్చు. కానీ అలాజరగకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. రోగిని పరీక్షించిన వైద్యుడు రాసి ఇచ్చిన మందులు తీసుకునేందుకు వెళ్తే విధులు నిర్వహించే పార్మసిస్టు రోగి ఆధార్‌, చిరునామా వైద్యులు రాసిన మందులు, సంస్థ పేర్లు తదితర వివరాలు అంతర్జాలంలో నమోదు చేస్తారు.  దీంతో మందుల వృథాకు అడ్డుకట్ట వేయడంతో పాటు వైద్య సిబ్బంది కూడా తప్పనిసరిగా విధుల్లో ఉండాల్సి ఉంటుంది.