ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

కార్యకర్తలకు మంత్రి మహేందర్‌ రెడ్డి సూచన

వికారాబాద్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ తలపెట్టిన పథకాలను ప్రజల వద్దకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి మహేందర్‌ రెడ్డి అన్నారు. కల్యాణ, లక్ష్మి షాదీ, ముబారక్‌, వృద్దాప్య పెన్షన్‌, వికలాంగుల పెన్షన్‌, రుణమాఫీ, రైతు బీమా, రైతుబంధు, కంటి వెలుగు ఇలా ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టారని వాటిని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి అన్నారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే కేసీఆర్‌ పాలన మరో 20 ఏళ్ళు సాగుతుందని మంత్రి మహేందర్‌ రెడ్డి అన్నారు. వికారాబాద్‌ క్లబ్బులో టీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తలతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి సమావేశమయ్యారు. ప్రగతి నివేదన సభకు ప్రజలను భారీగా తరలించినందుకు అభినందించారు. అదే తరహాలో ఇకముందు కూడా బహిరంగ సభకు కార్యకర్తలు చర్యలు చేపట్టాలని అందుకు కావలసిన వాహనాలను తాము సహకరిస్తామని ఆయన అన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సభను విజయవంతం చేయాలని.. వికారాబాద్‌ జిల్లా నుంచి 25 వేల నుంచి 30 వేల వరకు ప్రజలను తరలించాలని అన్నారు., ప్రగతి నివేదన జరిగే సభకు వికారాబాద్‌ కేవలం వంద కిలోవిూటర్ల లోపే ఉంటుంది కాబట్టి ఇక్కడినుండి కార్యకర్తలు ప్రజలను భారీ ఎత్తున తరలించాలని వారన్నారు. సాధ్యమైనంతవరకు మహిళలను కూడా తరలించాలని వారికి కావలసిన అన్ని రకాల సదుపాయాలు ప్రాంగణం వద్ద ఉన్నాయని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎమ్మెల్యే సంజీవరావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ కొండల్రెడ్డి టిఆర్‌ఎస్‌ టిఆర్‌ఎస్‌ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.