ప్రభుత్వ పాఠశాలలపై పెరిగిన భరోసా

విద్యార్థినిలకు హెల్త్‌కిట్స్‌తో రక్షణ

వరంగల్‌,జూలై19(జ‌నం సాక్షి): స్వరాష్ట్రంలో విద్యావ్యవస్థ పటిష్టం కోసం నాలుగేళ్లుగా ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలతో ప్రజల్లో నమ్మకం పెరిగింది. ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెరిగింది. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్న విద్యార్థినుల కోసం ప్రత్యేక హైజెనిక్‌ హెల్త్‌కిట్లను అందజేస్తున్నది. ఇదో విప్లవాత్మక మార్పుగానే చూడాలి. దానికి అనుగుణంగా సౌకర్యాలు, విద్యాప్రమాణాలను అందించాల్సి ఉంది. ప్రతీ పాఠశాలలో మౌలిక వసతులను మెరుగుపర్చడంతో పాటు భవనాలను రంగులు వేసి అందంగా తీర్చిదిద్దాలన్నారు. ఇక ప్రతీపాఠశాలలో గ్రీనరీని అభివృద్ధి చేసి చక్కని వాతావరణం కల్పించనున్నారు. ఉమ్మడి జిల్లాలో జిల్లాకు రూ.10కోట్ల చొప్పున రూ.50 కోట్లు అదనంగా మంజూరు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో పాఠశాల విద్య, ఉన్నత విద్యపై ఇటీవల ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కూలంకుషంగా చర్చించారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విద్యావ్యవస్థపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టిసారించి మరింత మెరుగుపర్చాలన్నారు. ఉమ్మడి జిల్లాలో ఏ ఒక్క పాఠశాల కూడా అసౌకర్యాలతో ఉండడానికి వీలులేదని కడియం స్పష్టం చేశారు. విద్యావ్యవస్థ పనితీరును మరింతగా మెరుగుపర్చి నాణ్యమైన విద్యాబోధన అందించేలా చూడాలన్నారు. ఇక 16781మంది విద్యావలంటీర్ల నియామకానికి ఆర్థికశాఖ అనుమతి లభించింది. నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం ఎట్టిపరిస్థితుల్లో ఈ నెల 20వ తేదీలోగా వారు విధుల్లో చేరేలా చూడాలని కలెక్టర్లకు, విద్యాశాఖ అధికారులకు సూచించారు. వారికి గౌరవ భృతి కూడా రూ.12వేలకు పెంచినట్లు తెలిపారు. ప్రతీ పాఠశాలకు సంబంధించిన ప్రొఫైల్‌ను మండలాలవారీగా తయారుచేయాలని ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అదనంగా అవసరమైన నిధులను కేటాయించేలా కలెక్టర్లు చూడాలని, ప్రాధాన్యతా అంశాలుగా పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుత్‌ సరఫరా, ఫర్నీచర్‌ సమకూర్చాలని కడియం ఆదేశించారు. ఇప్పటికే వివిధ పరీక్షలు పూర్తిచేసిన ఉపాధ్యాయుల నియామకం పూర్తిచేస్తామని చెప్పారు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో బిజీగా ఉండే కలెక్టర్లు విద్యాశాఖపై నెలకోసారైనా సవిూక్ష నిర్వహించుకోవాలని సూచించారు.