ప్రమాదంలో ఆరు లక్షల మంది టెక్కీలు

ఐటీ ఉద్యోగులకు మరింత షాకింగ్ న్యూస్. ఇప్పటికే చాలా మందిని తొలగించిన పెద్దపెద్ద కంపెనీలు.. రానున్న రోజుల్లో లక్షల్లో ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని హెడ్ హంటర్స్ ఇండియా ధ్రువీకరిస్తోంది. ఈ సంస్థ ఉద్యోగుల ఎంపికలో ఐటీ కంపెనీలకు సహకరిస్తోంది. ఈ ఏడాది సుమారు 2 లక్షల మంది టెకీలు ఉద్యోగాలు కోల్పోతారని చెబుతోంది హెడ్ హంటర్స్ ఇండియా నివేదిక. ఫిబ్రవరి 17న నాస్కామ్‌ ఇండియా లీడర్‌షిప్‌ సదస్సులో మెకిన్సే అండ్‌ కంపెనీ ఇచ్చిన నివేదికను విశ్లేషిస్తే ఈ వివరాలు తెలుస్తున్నాయని తెలిపింది. ప్రస్తుతం ఐటీ సేవల సంస్థల్లో ఉన్న సిబ్బందిలో దాదాపు సగం మంది, రాబోయే 3-4 ఏళ్లలో అప్పటి అవసరాలకు తగినట్లు ఉండరని ఆ నివేదిక పేర్కొంది.

కొత్త టెక్నాలజీ నేర్చుకోకపోతే కష్టాలు మరిన్ని తప్పవంటున్నారు నిపుణులు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి కొత్త టెక్నాలజీల వల్ల తక్కువ మంది సిబ్బందితోనే పనులు పూర్తవుతున్నాయి. వీటిల్లో అప్ డేట్ కాకపోతే ఉద్యోగులను తొలగించడం ఖాయమంటున్నారు. మాన్యువల్‌ టెస్టింగ్‌, టెక్నాలజీ సపోర్ట్‌, సిస్టమ్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగాల్లో ఉద్యోగాలు ఎక్కువగా పోయే అవకాశం ఉందని తెలిపారు. డిజిటల్ టెక్నీలజీలు నేర్చుకొనే దాకా ఈ తొలగింపులు ఉంటాయని తెలిపారు.

టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా టెకీలు రెడీగా లేకపోతే ఉద్యోగాలు కోల్పోవడం గ్యారెంటీ అంటున్నారు హెడ్ హంటర్స్ ఇండియా ప్రతినిధులు. రాబోయే రోజుల్లో ఈ లెక్కన 30-40 శాతం మంది సిబ్బంది కొనసాగకపోవడం జరుగుతుందని తెలిపారు. మొత్తం ఐటీ సిబ్బందిలో, 50-60 శాతం మంది ప్రస్తుత నైపుణ్యాలతో, సంప్రదాయ ఐటీ సేవల్లో కొనసాగవచ్చు. మిగిలినవారు తొలగింపునకు గురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. రాబోయే మూడేళ్లలో ఇలా ఇబ్బంది పడేవారు 5-6 లక్షల మంది ఉండొచ్చు. అంటే సగటున ఏడాదికి 1.75 – 2.0 లక్షల మంది తొలగింపునకు గురవుతారని అంటున్నారు హెడ్ హంటర్స్ ఇండియా చీఫ్ లక్ష్మీకాంత్‌. ముంబై, బెంగళూరు వంటి మహానగరాల్లో తొలగింపులు ఉండవని, కోయంబత్తూరు వంటి మరికొన్ని చిన్న ప్రాంతాల్లో ఉంటాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు స్థానికులకే ఉద్యోగాలివ్వాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిబంధనలు కూడా ఉద్యోగులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని తెలిపారు.