ప్రమాదస్థాయిలో భారత్‌ పాక్‌ పరిస్థితులు

భారత్‌పై పాక్‌ ముందు అణుదాడి చేయాలి: ముషారఫ్‌
అబుదాబి,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌-పాకిస్తాన్‌ మధ్య సంబంధాలు మళ్లీ ప్రమాద స్దాయికి చేరుకున్నాయని పాక్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషార్రఫ్‌ అన్నారు. ఇరుదేశాల మధ్య అణ్వస్త్ర దాడి ఉండబోదని వ్యాఖ్యానించారు. తాము ఒక అణు బాంబుతో భారత్‌పై దాడి చేస్తే పొరుగు దేశం(భారత్‌) 20 అణు బాంబులతో తమను నాశనం చేస్తుందని చెప్పుకొచ్చారు. భారత్‌పై తొలుత తాము 50 అణుబాంబులతో విరుచుకుపడటమే దీనికి పరిష్కారమన్నారు. అలా చేస్తేనే భారత్‌ తిరిగి తమపై ప్రతిదాడి చేసే అవకాశం సన్నగిల్లుతుందన్నారు. కాగా పాకిస్తాన్‌తో మెరుగైన సంబంధాల కోసం ఇజ్రాయెల్‌
ఆసక్తి కనబరుస్తోందన్నారు. తమ దేశంలో రాజకీయ వాతావరణం సానుకూలంగా ఉంటే తాను పాకిస్తాన్‌కు తిరిగి వెళతానని దుబాయ్‌లో ఆశ్రయం పొందుతున్న ముషార్రఫ్‌ పేర్కొన్నారు. కాగా, 2001-08 మధ్యకాలంలో పాక్‌ అధ్యక్షుడిగా ఉన్న ముషార్రఫ్‌, అభిశంసన నుంచి తప్పించుకునేందుకు రాజీనామా చేశారు. చికిత్స పేరుతో దుబాయ్‌ వెళ్లిన ముషార్రఫ్‌ మళ్లీ పాక్‌కు రాలేదు. 2007లో రాజ్యాంగాన్ని రద్దుచేయడంతో ముషార్రఫ్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. అయితే తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆయన గమనిస్తున్నారు.