ప్రమాదాలనూ జగన్‌ రాజకీయం చేస్తున్నారు

– పడవ ప్రమాదం ప్రభుత్వ హత్య ఎలా అవుతుంది
– వైఎస్‌ హయాంలో ఘటనలనూ ప్రభుత్వ హత్యలుగా అంగీకరిస్తావా?
– రాజకీయ లబ్ధికోసం చౌకబారు మాటలు మానుకో
– విలేకరుల సమావేశంలో మంత్రి నక్కా ఆనందబాబు
గుంటూరు, మే17(జ‌నం సాక్షి) : తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సవిూంపలో జరిగిన హృదయ విదారకమైన పడవ ప్రమాద ఘటనను సైతం రాజకీయం చేసేందుకు ప్రతిపక్ష నేత జగన్‌ ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. గుంటూరు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విూడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి… పడవ ప్రమాదాన్ని ప్రభుత్వ హత్యంటూ జగన్‌ చేసిన ఆరోపణలను ఖండించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనే పర్యటిస్తున్న జగన్‌కు బాధితులను పరామర్శించే తీరికే లేదా? అంటూ ప్రశ్నించారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా ఘటన జరగ్గా…. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయ కార్యక్రమాలను చేపట్టిందని గుర్తుచేశారు. గతంలో వైఎస్‌ హయాంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయని వాటినీ సర్కారు హత్యలుగా జగన్‌ అంగీకరిస్తారా అని మంత్రి ప్రశ్నించారు. వైఎస్‌ మృతి కూడా అప్పటి సర్కారు హత్యేనా అంటూ నిలదీశారు. రాజకీయ లభ్ది కోసం ఇలాంటి చవకబారు విమర్శలను జగన్‌ మానుకోవాలని మంత్రి ఆనందబాబు హితవు పలికారు.
ప్రజలను మభ్యపెట్టేందుకే జగన్‌ పాదయాత్ర చేస్తున్నారని ఆదినారాయణ విమర్శించారు. ఆస్తులు
పెంచుకునేందుకే మోదీతో జగన్‌ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. భారతి సిమెంట్‌ పరిశ్రమ తనది కాదంటున్నాడని… చివరకు భారతి తన భార్య కాదనే నీచ సంస్కృతి జగన్‌ది అని వ్యాఖ్యానించారు. ఉపఎన్నికలు జరిగితే జిల్లాల్లో 10అసెంబ్లీ స్థానాలు టీడీపివే అని…ఎంపీ అవినాష్‌కు ఘోర పరాభవం తప్పదని స్పష్టం చేశారు. జిల్లాలో తమ నేతల మధ్య కుమ్ములాటలు నిజమే అని, ఆ కుమ్ములాటలు పక్కనపెట్టి జిల్లాలో జగన్‌ను మట్టి కరిపిస్తామని మంత్రి ఆదినారాయణ తెలిపారు.
————————