ప్రముఖ జర్నలిస్టు దేవిప్రియ ఇకలేరు

 

 

 

 

 

– సీఎం కేసీఆర్‌ సంతాపం..

హైదరాబాద్‌,నవంబరు 21(జనంసాక్షి):ప్రముఖ కవి దేవీప్రియ ఇకలేరు. కొంతకాలంగా మధుమేహంతో బాధపడుతున్న దేవీప్రియ నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ ఉదయం 7.10 గంటలకు తుదిశ్వాస విడిచారు.ఆయన మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు కవిగా, రచయితగా, కార్టునిస్టుగా సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు కృషి చేశారని సీఎం కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన సాహిత్య ప్రతిభకు ‘గాలి రంగు’ రచన మచ్చుతునక అని అన్నారు.సాహితీ లోకంలో దేవీప్రియగా గుర్తింపు పొందిన ఆయన అసలుపేరు షేక్‌ ఖాజా హుస్సేన్‌. అనారోగ్యంతో మృతి చెందిన ప్రముఖ కవి, రచయిత, జర్నలిస్ట్‌ దేవిప్రియకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ నివాళులు అర్పించారు. శనివారం అల్వాల్‌ లోని దేవిప్రియ నివాసానికి వెళ్లి ఆయన భౌతిక కాయంపై పుష్ప గుచ్చాన్ని ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. సాహితీ, కళారంగానికి , జర్నలిజంలో దేవిప్రియ చేసిన సేవలను వినోద్‌ కుమార్‌ కొనియాడారు. ఈ సందర్భంగా దేవిప్రియ కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.దేవిప్రియకు నివాళులు అర్పించిన వారిలో ప్రముఖ సంపాదకులు కే. రామచంద్రమూర్తి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ప్రముఖ సాహితీవేత్తలు శివారెడ్డి, నందిని సిద్దారెడ్డి, నాలేశ్వరం శంకరం, సీనియర్‌ జర్నలిస్టులు పాశం యాదగిరి, సైదా రెడ్డి, సినీ దర్శకుడు బీ. నర్సింగరావు, టీ.యూ.డబ్ల్యు,జె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ, తదితరులు ఉన్నారు.