ప్రయాస లేకుండా అవతరణ ఉత్సవాలు 

మంచి నిర్ణయానికి శ్రీకారం అంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు
సర్వత్రా కెసిఆర్‌పై  ప్రశంసల జల్లు
హైదరాబాద్‌,మే18(జ‌నంసాక్షి):  తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలుగకుండా, మరింత వైభవంగా నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించడంపై సర్వత్రా హర్షామోదాలు వ్యక్తం అవుతున్నాయి. జూన్‌ 2 ఎండలు మండుతున్న వేళ ప్రధానంగా బడిపిల్లలకుయాతన తప్పనుందని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వ్యాఖ్యానించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్‌ 2వ తేదీన జరుగుతుంది.. ఆ రోజు విపరీతమైన ఎండ ఉంటుంది.. వడగాడ్పులు కూడా ఉంటాయి. అప్పుడు పాఠశాలలకు సెలవులుంటాయి. ఈ సమయంలో విద్యార్థులను ఇండ్ల నుంచి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు. అలాగే స్కూళ్లను కూడా తెరిపించడం సరికాదు. ఎండలో కవాతు చేయడం వల్ల పోలీసులు, విద్యార్థులు కళ్లు తిరిగి పడిపోయిన సందర్భాలున్నాయి. తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు.  ప్రజలకు, విద్యార్థులకు, పోలీసులకు పెద్దగా యాతన లేకుండా స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలతో పాటు, రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సిఎం కెసిఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు ప్రత్యామ్నాయ పద్ధతులు ఆలోచించాలని సూచించారు. జాతీయ, రాష్ట్ర పండుగల నిర్వహణకు అనుసరించాల్సిన పద్ధతులపై ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రగతి భవన్‌లో సవిూక్ష సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన దార్శనికతను సూచించాయి. ఇలా చేయడం వల్ల ప్రజల్లో కూడా సానుకూలత వస్తోంది. ఆడంబరాలకు పోకుండా, వివిధ వర్గాలను ఇబ్బందుల పాల్జేయకుండా చేయడమన్నది మంచినిర్ణయమని టిఆర్‌ఎస్‌ శ్రేణులు కూడా భావిస్తున్నాయి. నిజానికిరాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసు బలగాలను పిలిపించి ఎండలో కవాతు నిర్వహించడం, విద్యార్థులను కూడా రప్పించి ఎండలో ఇబ్బంది పెట్టడం లాంటి కార్యక్రమాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. ఉన్నతాధికారులు వారి అభిప్రాయాలను వెల్లడించడంతో , ప్రస్తుతం అనుసరిస్తున్న సంప్రదాయాలు, పద్ధతుల్లో ఏమైనా మార్పులు అవసరమా? అనే అంశాలపై సీనియర్‌ అధికారులతో చర్చించి, రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకోవాలని కెసిఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషిని ఆదేశించారు. పరేడ్‌ గ్రౌండ్‌ కూడా ఉత్సవాల నిర్వహణకు అనువుగా లేదని సమావేశంలో అధికారులు అభిప్రాయపడ్డారు. పబ్లిక్‌ గార్డెన్‌ లోని జూబ్లీహాల్‌ కు ఎదురుగా ఉన్న మైదానంలో ఉత్సవాలు నిర్వహిస్తే సబబుగా ఉంటుందని సిటి పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ ప్రతిపాదించారు. ఇతర అధికారులు కూడా దీన్ని అంగీకరించారు. పతాకా విష్కరణ, ముఖ్య అతిథి ప్రసంగాలకే పరిమితం కాకుండా, ఎట్‌ ¬ం, కవి సమ్మేళనాలు, అవార్డుల ప్రదానోత్సవాలు కూడా నిర్వహించాలని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో వివిధ వర్గాలు కూడా ఈ అభిప్రాయాలను స్వాగతిస్తున్నారు. ఓ మంచి నిర్ణయంతో పాటు వివిధ వర్గాలకు పాల్గొనే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఇకపోతే వచ్చే నెల 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటి కార్యక్రమాన్ని ఈ సమావేశంలో ఖరారు చేశారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు ప్రధాన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ముందుగా తెలంగాణ అమరవీరుల స్థూపానికి ముఖ్యమంత్రి కెసిఆర్‌ నివాళులు అర్పిస్తారు. 9 గంటల నుంచి వరుసగా పతాకావిష్కరణ, పోలీసుల గౌరవ వందనం, ముఖ్యమంత్రి సందేశం తదితర కార్యక్రమాలుంటాయి. 10.30 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యలో ఎట్‌ ¬ం నిర్వహిస్తారు. 11 గంటలకు జూబ్లీ హాలులో
తెలంగాణ రాష్ట్ర అవతరణ అంశంపై కవి సమ్మేళనం జరుగుతుంది. సాయంత్రం అవార్డుల ప్రదానోత్సవం ఉంటుంది. రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు స్వాతంత్య్ర సమరయోధులను, ప్రజాప్రతినిధులను, హైదరాబాద్‌ లో ఉండే ముఖ్యమైన ప్రభుత్వ అధికారులను, ప్రముఖ విద్యాసంస్థల అధిపతులను, ప్రముఖ వైద్యశాలల అధిపతులను, కేంద్ర ప్రభుత్వ సంస్థల అధిపతులను, మాజీ న్యాయమూర్తులను, జాతీయ పురస్కారాలు అందుకున్న ప్రముఖులను, ప్రముఖ క్రీడాకారులను, ప్రముఖ కళాకారులను, పారిశ్రామిక వేత్తలను, ఐటి కంపెనీల ప్రతినిధులను, విద్యావేత్తలను, బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులను ఆహ్వానించాలని సమావేశంలో నిర్ణయించారు.