ప్రయివేటు లెక్చరర్ల సమస్యలు పరిష్కరించే వారికే మద్దతు

 

మహబూబాబాద్‌, నవంబర్‌ 18(జనంసాక్షి):

రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని ప్రయివేటు కళాశాలల లెక్చరర్ల సమస్యలు పరిష్కరించే వారికే మా మద్దతు ఉంటుందని తెలంగాణ ప్రయివేటు కాలేజ్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కమిటి అధ్యక్షులు సంకెపెల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. స్థానిక వీరబ్రహ్మంద్రస్వామి దేవాలయ ఆవరణ సమావేశ మందిరలో విస్తృతస్థాయి సమావేశం జిల్లా అధ్యక్షులు నీలం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో ప్రయివేటు లెక్చరర్లు తమ ఉద్యోగాన్ని సైతం వదులుకుని పోరాటం చేశారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పునర్‌నిర్మాణంలో ప్రయివేటు లెక్చరర్ల సమస్యలు పరిష్కరించబడకపోవడంతో వారి జీవనం అత్యంత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి లెక్చరర్‌కు 200గజాల స్థలం, గృహ నిర్మాణం కోసం జాతీయ బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం, విధి నిర్వహణలో మరణించిన వారికి జీవిత భీమా సౌకర్యం, హెల్త్‌కార్డులు, పీఎఫ్‌, నిరుపేదల లెక్చరర్లకు డబుల్‌బెడ్‌రూం వంటివి కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర పత్రికా విభాగం అధ్యక్షులు కడుదుల జనార్ధన్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి శనిగరం రమేష్‌, కుదురుపాక జనార్ధన్‌, కోశాధికారి ముత్యాల ప్రశాంత్‌, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్‌ ఉపేందర్‌, ప్రధాన కార్యదర్శి జనార్ధనాచారి, మండల కమిటీ అధ్యక్షులు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి కిషన్‌, పట్టణ అధ్యక్షులు రాజగోపి, ప్రధాన కార్యదర్శి వెంకన్న, లెక్చరర్లు పాల్గొన్నారు.