ప్రశాంత ఎన్నికలకు కసరత్తు

మావోల ప్రభావం లేదన్న ఎస్పీ

ఆదిలాబాద్‌,జనవరి19(జ‌నంసాక్షి): గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మూడంచెల భద్రతతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ విష్ణువారియర్‌ తెలిపారు. ఎన్నికల్లో మావోయిస్టుల ప్రభావం ఉండబోదని, అయినా ఎన్నికల సమయంలో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్‌ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికలు పూర్తి అయ్యే వరకు చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీలు కొనసాగించాలన్నారు. ప్రతి గ్రామంలో పోలీసుల నిఘా డేగ కన్నుతో ప్రజల రక్షణకు భంగం కలగకుండా బందోబస్తు నిర్వహిస్తారన్నారు. ఎన్నికల నియమావళి, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు తమ విధులను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఇద్దరితో పోలీస్‌ బందోబస్తు ఉంటుందని, సమస్యాత్మక కేంద్రాల్లో సాయుధ పోలీసులతో పాటు ఎస్సై, ఏఎస్సై స్థాయి సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా పోలీసు అధికారులతో గ్రామ పంచాయతీ ఎన్నికల బందోబస్తుపై సవిూక్ష నిర్వహించారు. పోలీసులు గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కల్పించడానికి కృషి చేస్తున్నారని, నాటి కృషి నేటి ఎన్నికల సమయంలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామ ప్రజలతో సత్సంబంధాలు నెలకొలనడంతో భద్రతాపరమైన చర్యల్లో రాణించాలని తెలిపారు. పల్లె ప్రజలు ఆవేశాలకు లోనుకావొద్దని, ఏ సమస్యలు తలెత్తినా పరిష్కరించడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ఇటీవలే శాసనసభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన అనుభవంతో పంచాయతీ ఎన్నికలను సాఫీగా కొనసాగించడానికి జిల్లా పోలీసులు సిద్ధంగా ఉన్నారని సూచించారు.