ప్రశాంత పోలింగ్‌కు ఏర్పాట్లు

కమిషనర్‌ రవీందర్‌
వరంగల్‌,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): ఎన్నికల సమయంలో అవాంచనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ అన్నారు. ప్రశాంత వాతావారణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. కమిషనరేట్‌ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలను సాధారణ, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు గుర్తించి వాటికి భద్రత కల్పిస్తున్నామన్నారు. ఎన్నికలలో కేంద్ర బలగాలు, సీసీ కెమెరాలతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉన్న పరిస్థితులను అంచనా వేసి స్థానిక పోలీసులతోపాటు కేంద్ర సాయుధ పోలీసు సిబ్బందిని నియమించామని తెలిపారు. ఎన్నికల సమయంలో రూట్‌ మొబైళ్లు, స్టైక్రింగ్‌ ఫోర్స్‌, స్పెషల్‌ స్టైక్రింగ్‌ ఫోర్స్‌, సిబ్బంది సైతం విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. అన్ని పోలింగ్‌ కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పరిస్థితి ఎప్పటికప్పుడు అంచనా వేసి కమిషనరేట్‌లోని కమెండ్‌ కంట్రోల్‌ గది నుంచి అధికారులు పర్యవేక్షిస్తుంటారని తెలిపారు. పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి సమాచారం, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ పద్ధతి కేంద్ర సాయుధ బలగాల అధికారులకు పోలీసు కమిషనర్‌ వివరించారు.