ప్రశాంత పోలింగ్‌ కోసం ఏర్పాట్లు

దివ్యాంగులకు ప్రత్యేకంగా సహాయకులు

వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పరిశీలన: కలెక్టర్‌

కామారెడ్డి,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు మూడు నియోజకవర్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించామన్నారు. శుక్రవారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రారంభమైసాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుందన్నారు. ఈ నెల 11న నూతన కలెక్టరేట్‌ సవిూపంలోని మార్కెటింగ్‌ శాఖ గోదాముల్లో కౌటింగ్‌ నిర్వహిస్తామని చెప్పారు. దివ్యాంగుల కోసం ర్యాంపులు, వీల్‌చైర్లను ఏర్పాటు చేశామన్నారు. వారిని పోలింగ్‌ కేంద్రాలకు తరలించేందుకు వాహనాలను సమకూర్చామని చెప్పారు. వీరికి సహాయకులుగా వలంటీర్లను నియమించామని వివరించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకునేందుకు పోలీస్‌శాఖతో కలిసి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ నిర్వహిస్తున్నామన్నారు. మిగిలిన కేంద్రాలన్నింటిలో డిజిటల్‌ నిఘా ద్వారా పోలింగ్‌ సరళిని చిత్రీకరిస్తామని పేర్కొన్నారు. ఇందుకు అత్యాధునిక సాంకేతికతో కూడిన ఎస్‌ఎస్‌టీ కెమెరాలను వినియోగిస్తున్నామని వెల్లడించారు. ఇవిఎం యంత్రాలను తనిఖీ చేశామని, లోపాలు లేనివే నిర్ణయించాకే సరఫరా చేశామన్నారు. అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని జిల్లాలో 144 సెక్షను అమలు చేస్తున్నామన్నారు. ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకునేందుకు 188 సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ జరిగేతీరును పరిశీలించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. సాధారణ పౌరులు ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. సీ-విజిల్‌ యాప్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి తగు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఓటర్లను ఏదేని రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థులు గాని వారి అనుచరులు గాని ప్రలోభాలకు గురిచేస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని సూచించారు.