ప్రశ్నిస్తే సస్సెండ్‌ చేస్తారా? 

– ఇదీ రాజన్న రాజ్యంలో పరిస్థితి
– ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై ట్వీట్‌ చేసిన నారా లోకేశ్‌
అమరావతి, జులై23(జ‌నంసాక్షి) : ప్రజా సమస్యలపై ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నిస్తుంటే వైకాపా ప్రభుత్వం తట్టుకోలేక పోతుందని, అందుకే ప్రశ్నించే టీడీపీ సభ్యులను సభను సస్పెండ్‌ చేశారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు. మంగళవారం ఈ మేరనకు ఆయన ట్విట్టర్‌లో పలు
ప్రశ్నలు సంధించారు. ప్రజల పక్షాన నిలిచిన నాయకులకు రాజన్న రాజ్యంలో పరిస్థితి ఇదీ! అంటూ ట్వీట్‌ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని మార్షల్స్‌ తీసుకొస్తున్న ఫోటోను పోస్టు చేశారు. 46ఏళ్లకు జగన్‌కు ఉద్యోగం వచ్చిందని, 45ఏళ్లకే పింఛన్‌రత్నం మాయమైందని ఎద్దేవా చేశారు. పాదయాత్రలో గుర్తొచ్చిన ప్రజల కాళ్లనొప్పులు కుర్చీ ఎక్కగానే మర్చిపాయారా అని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు 45ఏళ్లకే పింఛన్‌ అన్నారని, ఇప్పుడు మాట మార్చి వారిని మోసం చేశారని లోకేశ్‌ విమర్శించారు. జగన్‌ ఇచ్చిన హావిూ మేరకు ఒక్కో మహిళలకు 1.20లక్షల ఇవ్వాలని, జగన్‌ ఇప్పుడు మాటమార్చడంతో ఒక్కో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళకు రూ.45వేలు నష్టం జరుగుతుందని లోకేశ్‌ ట్విట్టర్‌లో  పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రశ్నోత్తరాల సమయంలో వైకాపా ఎన్నికల హావిూపై స్పష్టతకు తెదేపా సభ్యుడు రామానాయుడు డిమాండ్‌ చేశారు. అయితే మేనిఫెస్టోలో అలాంటి హావిూ ఇవ్వలేదని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ జోక్యం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో తాను మాట్లాడిన వీడియోను సభలో ప్రదర్శించారు. దీనిపై స్పందించిన తెదేపా సభ్యులు తమ వద్ద ఉన్న వీడియోను ప్రదర్శించేందుకు అనుమతి కోరారు. దీనికి ప్రభుత్వం నిరాకరించడంతో స్పీకర్‌ తదుపరి ప్రశ్నకు వెళ్లారు. దీంతో తెదేపా సభ్యులు ఆందోళనకు దిగారు. ఆగ్రహించిన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌.. ఈ సమావేశాలు ముగిసేవరకు తెదేపా సభ్యులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బుచ్చయ్య చౌదరిలను సస్పెండ్‌ చేయాలని స్పీకర్‌కు ప్రతిపాదించారు. స్పీకర్‌ స్థానంలో ఉన్న ఉపసభాపతి కోన రఘుపతి దీనిని ఆమోదించారు. అయినప్పటికీ తెదేపా సభ్యులు సభను వీడలేదు. అక్కడే ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రామానాయుడుని మార్షల్స్‌ బలవంతంగా బయటకు తీసుకెళ్లిపోయారు.