ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ కుట్ర రాజకీయాలు

పుట్టగతులుండవనే కేసులతో అడ్డుకునే యత్నం

మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిధిలో నిర్మించే జలాశయాల నిర్మాణం జరిగితే పుట్టగతులు ఉండవనే కాంగ్రెస్‌ పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి మండిపడ్డారు. ప్రాజెక్టులు పూర్తయితే పుట్టగతులు ఉండవనే భయం కాంగ్రెస్‌కు పట్టుకుందన్నారు. పదేళ్ల ఉమ్మడి పాలనలో తెలంగాణకు తీరనిఅన్యాయం చేసిన కాంగ్రెస్‌ ఇప్పుడు ప్రాజెక్టులను అడ్డుకోవడం ద్వారా ద్రోహంచేస్తోందన్నారు. కొందరు కాంగ్రెస్‌ నేతలకు ఆంధ్రపై ఉన్న ప్రేమ తెలంగాణపై లేదని ఆరోపించారు. ఇక్కడ ప్రాజెక్టులు కడితే ఏపీకి నీళ్లు వెళ్లవన్న బాధతో కేసులు వేస్తున్నారని ఆయన తెలిపారు. ఇది చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు. ఈ పార్టీ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకు తక్కువ పరిహారం అందించారని.. ఇప్పుడు తెరాస ప్రభుత్వం ఎక్కువ పరిహారం అందిస్తోందని తెలిపారు. భూసేకరణకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నా కాంగ్రెస్‌ నేతలు వారిని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులను అడ్డుకుంటే ప్రతిపక్షాలను తరిమికొడతామని స్పష్టం చేశారు. రైతులకు భూములు ఇవ్వకుండా కాంగ్రెస్‌ పార్టీ అడ్డుకుంటున్నదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్‌ ను విమర్శిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఇకపోతే హరితహారంలో మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను సైతం స్వీకరిస్తామని అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇప్పటికే 50లక్షల మొక్కలు నాటామని.. వర్షాభావ పరిస్థితుల్లో నెమ్మదించినా.. జిల్లాలో రెండు కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.